ప్రజాసమస్యలను ప్రస్తావించిన వైఎస్సార్సీపీ

హైదరాబాద్ః  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని వైనాన్ని సభా ముఖంగా...ప్రశ్నోత్తరాల సమయంలో ఎండగట్టారు. 

ప్రభుత్వం మాట‌లు చెబుతూ కాలం వెళ్ల‌దీయ‌డం కాదని, ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను నేర‌వెర్చి చూపించాల‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.  టీడీపీ స‌ర్కార్ ఎన్నిక‌ల‌కు ముందు  బీసీ కులవృత్తులపైన వృత్తి, సేవాప‌న్నుల‌ను ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని అది ఇంత‌వ‌ర‌కు అమ‌లుకు నోచుకోలేద‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి స‌భ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా స్వర్ణకారులు పోలీసుల వేధింపులకు గురికాకుండా జీవోను మార్చుతామని ప్రభుత్వం మేనిఫెస్టోలే పేర్కొందని ...అది జరగకపోగా వేధింపులు మరింతగా ఎక్కువయ్యాయని ఆరోపించారు. 

గిరిజన ప్రాంతంలో దళితులకు ఇందిర జలప్రభ పథకం కింద ఇచ్చిన భూముల్లో ..అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. అక్కడ భూముల్లో గోతులు తవ్వారే తప్ప బోర్లు వేయలేదు, కరెంటు ఇవ్వలేదని అన్నారు. ఎక్కడైతే ఖర్చులు చూపించారో దానికి అనుగుణంగా విచారణ చేపట్టాలన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని కేవలం జన్మభూమి కమిటీలకే ఇస్తున్నారని, అలా కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్ర‌మాదాలు స్వ‌ల్పంగా పెరిగాయ‌ని సదరు మంత్రి చెప్పడాన్ని ఎమ్మెల్యే రాజన్నదొర తీవ్రంగా తప్పుబట్టారు.  ఒక్క సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే జ‌న‌వ‌రి నెల‌లో ఇద్ద‌రు గిరిజ‌నుల‌ను స‌జీవ‌ద‌హ‌నం చేయ‌డం, మేంటాడి మండ‌లంలో ఓ గిరిజ‌న మ‌హిళ‌పై లైంగిక దాడి జ‌రిగింద‌ని రాజ‌న్న‌దొర అన్నారు. ఈ విధంగా గిరిజ‌నులు, హ‌రిజ‌నుల‌పై దాడులు, నేరాలు  జ‌రుగుతున్న‌ప్పుడు ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హారించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని సూచించారు. అంతేకాకుండా హ‌రిజ‌నులు, గిర‌జ‌నుల‌ను ఆర్థికంగా ఆదుకోవాల‌న్నారు.  దాడులకు పాల్పడిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి, బాధితులకు న‌ష్ట‌ప‌రిహారం అందించాల‌ని డిమాండ్ చేశారు. 

స్వర్ణకారుల కష్టాలను ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సభ దృష్టికి తీసుకొచ్చారు. నెల్లూరుకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి స్వర్ణకారులు రావడం వల్ల స్థానికులకు పనులు లేకుండా పోయాయని...కావున స్థానిక స్వర్ణకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్వర్ణకారుల కోసం ఫెడరేషన్, శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మిషనరీస్ కొనేందుకు లోన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లకు జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది గనుక పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందన్నారు.  స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, దానిపై కూడా దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. 

వ్యవసాయ రంగాన్ని, క్షోభాన్ని గట్టెక్కించేవిధంగా బడ్జెట్ ఉండకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కరవు ఛాయలను చూశాం. ప్రభుత్వమే రెండు విడతలుగా కరవు మండలాలను ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని ఆదుకునేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, రైతుల పంటలకు ధరలు రాని పరిస్థితి ఉందని విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
Back to Top