అసెంబ్లీ వ‌ద్ద వైయస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆందోళ‌న‌

  • మీడియాను లోప‌లికి అనుమ‌తించాల‌ని ధ‌ర్నా
  • గేటు వ‌ద్ద బైఠాయించి నిర‌స‌న‌
  • అధికారుల తీరుపై ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల ఆగ్ర‌హం
అమరావతి:  వెల‌గ‌పూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవ‌నాన్ని ప‌రిశీలించేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, మీడియాను పోలీసులు, అధికారులు అడ్డుకోవ‌డంతో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. అధికారుల తీరును నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వ‌ద్ద బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. నోటికి న‌ల్ల‌గుడ్డ‌లు క‌ట్టుకొని నిర‌స‌న తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పలు భవనాలు లీకులమయం కావడంతో దాన్ని పరిశీలించేందుకు మీడియా ప్రతినిధులను తీసుకుని లోపలకు వెళ్లేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. అయితే అక్కడున్న పోలీసులు, ఇతర అధికారులు మాత్రం మీడియాను లోపలకు అనుమతించలేదు. కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే వెళ్లనిస్తామని, మీడియాను లోపలకు రానివ్వబోమని, ఆ మేరకు తమకు స్పష్టమైన ఉత్తర్వులున్నాయని అసెంబ్లీ కార్యదర్శి చెప్ప‌డంతో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మీడియాను నియంత్రించడం సరికాదని, వర్షానికి తడిసి ముద్దయిన అసెంబ్లీ ఎలా ఉందో ప్రపంచానికి తెలియాలని మరికొందరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత చాంబరే ఇలా ఉంటే ఇక అసెంబ్లీ హాల్ ఎలా ఉందోనని అనుమానం వ్యక్తం చేశారు. రూ. 900 కోట్లు ఖర్చుపెట్టి నాసిరకం పనులు చేపట్టారని, అసెంబ్లీ నిర్మించేటపుడు తొందరపాటు వద్దని ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్ చెబుతున్నా తనకు అనుభవం ఉందంటూ చంద్రబాబు ఊదరగొట్టారని చెప్పారు. వాస్తవాలు ప్రజలకు తెలియకూడదనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, చంద్రబాబు వల్ల ఏపీ పరువు పోయిందని, ప్రపంచ స్థాయి నిర్మాణం అంటే ఇదేనా అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, మేకా ప్ర‌తాప్ అప్పారావు, డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి, ముస్తాఫా, కోన ర‌ఘుప‌తి, ర‌క్ష‌ణ నిధి త‌దిత‌రులు పాల్గొన్నారు.

వాస్త‌వాలు బ‌య‌ట‌కు చెప్ప‌డానికే మీడియా: ఆర్కే
అసెంబ్లీ లోప‌ల నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను బ‌య‌ట‌కు చెప్పేందుకే మీడియాను తీసుకెళ్తున్నామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10 వేలు ఖర్చుపెట్టి ప్రపంచ స్థాయిలో తాత్కాలిక రాజధాని భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారని, కానీ గట్టిగా ఒకటి, రెండు సెంటీమీటర్ల వానకే భవనాలన్నీ లీకుల మయం అయిపోయాయని ఆయ‌న విమర్శించారు. లోప‌ల ఉన్న వాస్తవాలను బయటకు చెప్పడానికి మీడియాను తీసుకుని లోపలకు వెళ్దామంటే కనీసం అనుమతి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ లోపలకు కాకపోయినా కనీసం ప్రాంగణంలో మీడియా పాయింటు ఉంది కాబట్టి అక్కడి వరకు అనుమతించాలని కోరినా, దానికి కూడా అంగీకరించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనివెనక దురుద్దేశాన్ని గమనించాలని, వైయ‌స్ జగన్ చాంబరే కాదు, అసెంబ్లీ, సీఎం చాంబర్, మంత్రుల చాంబర్లు ఎలా ఉన్నాయో కూడా చూపించాలని ఆర్కే డిమాండ్ చేశారు. లోపల ఎవరో సిబ్బంది తీసిన చిన్న వీడియో క్లిప్ ద్వారానే ఈ భవనాల బండారం మొత్తం బయటపడిందని, అందువల్ల లోపల భవనాల నాణ్యత ఎలా ఉందో కచ్చితంగా చూపించాలని ఆయన ప‌ట్టుబ‌ట్టారు.

నూజివీడు కాద‌ని ఇక్క‌డే ఎందుకు క‌ట్టారో:  మేక ప్ర‌తాప్ అప్పారావు
నూజివీడు ప్రాంతం రాజ‌ధాని నిర్మాణానికి అనుకూలంగా ఉంద‌ని, అక్క‌డ 140 ఎక‌రాల ప్ర‌భుత్వ భూములు ఉన్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావు అన్నారు. అక్క‌డ కాకుండా వెల‌గ‌పూడిలో ఎందుకు క‌ట్టారో ప్ర‌భుత్వ‌మే స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వెల‌గ‌పూడిలో అంతా నల్లమట్టి ఉంద‌ని, ఇది నిర్మాణాలకు పనికిరాదని ముందే చెప్పామని అన్నారు. తాము చెప్పిన విషయాలను పట్టించుకోకుండా.. ఏదో త్వరగా చేసేశామని చూపించుకోవాలన్న తొందరలో ఇలా నాణ్యత లేని నిర్మాణాలు చేయించారని, అందుకే కట్టిన కొద్ది రోజులకే ఇలా నీళ్లు కారుతున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని ఆయన చెప్పారు. 

Back to Top