తాత్కాలిక భవనాలకు రూ.1200 కోట్లా?

  • ప్రతిపక్ష నేతకు అసెంబ్లీలో పేషీ ఏదీ?
  • ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగిస్తాం
  • వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
  • వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యేలు
అమరావతి: వెలగపూడిలో  నిర్మిస్తున్న తాత్కాలిక భవనాలకు ప్రభుత్వం రూ.1200 కోట్లు ఖర్చు చేయడాన్ని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఇవాళ ఉదయం వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనాలను వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును పార్టీ నేతలు ఎండగట్టారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు..

త్వరలో బడ్జెట్‌ సమావేశాలు ఉన్నాయి కాబట్టి..మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనుమతితో నూతనంగా నిర్మిస్తున్న అసెంబ్లీ భవనాలను పరిశీలించేందుకు వచ్చాం. గతంలో చంద్రబాబు చెప్పిన మాట నిజమనిపించుకున్నారు. తాత్కాలిక సచివాలయంలోని ఆరు బ్లాక్‌ల నిర్మాణాన్ని రూ.200 కోట్లతో ప్రారంభించారు. ఇది పూర్తి చేసేందుకు రూ.1200 కోట్లు అయిందని చెబుతున్నారు. తాత్కాలిక భవనాలకు ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది?. లోపలంతా బాగానే ఉంది. కానీ ప్రతిపక్ష నాయకుడికి కనీసం పేషీ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వైయస్‌ జగన్‌ ఉండవచ్చు. రేపు చంద్రబాబే ప్రతిపక్ష నాయకుడిగా ఉండవచ్చు. ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇవ్వాలన్నది అధికార పక్షం ఆలోచించాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తప్పనిసరిగా పేషీ ఇవ్వాలి. ఆ పేషీకి దగ్గర్లోనే లెజిస్టేటివ్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను డిమాండ్‌ చేస్తున్నాం. అసెంబ్లీ సెక్రటరీతో నేను ఫోన్‌లో మాట్లాడాను. మేమింకా అలాట్‌ చేయలేదని ఆయన చెబుతున్నారు. అయితే ఇక్కడేమో స్టిక్కర్లు అతికించారు. అందులో ప్రతిపక్షానికి సంబంధించి ఏ ఒక్క స్టిక్కర్‌ కూడా కనిపించలేదు. అసెంబ్లీ కార్యదర్శి ఎందుకు దాపరికంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. సౌకర్యాలు ఉన్నా..లేకపోయినా మేం ప్రజల కోసమే ఎన్నుకోబడ్డాం. ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రజల పక్షాన ఉన్న ప్రతిపక్షానికి ఇక్కడ అగౌరవం కలిగిందంటే అది ప్రజలకు జరిగినట్లుగానే భావిస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తాం. అన్ని విషయాలు చర్చకు రావాలని కోరుతాం. స్పీకర్, ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రులు సభను నడిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు కాబట్టి అసెంబ్లీలో ప్రతిపక్షం తమ వాణిని వినిపించే విధంగా అవకాశం కల్పించాలి. పాత అసెంబ్లీని తిరిగి ఇక్కడ నడుపొద్దని వారిని కోరుతున్నాం.  ఇక రెండేళ్లే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండేది. 
––––––––––––––––––––
జాతిపిత విగ్రహం ఏర్పాటు చేయాలి
–ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనం వద్ద జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం 33 వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించారు. ఇందులో భూములిచ్చిన రైతులకు ఉండటానికి ఇళ్ల స్థలం మంజూరు చేయడం లేదు. ప్రతిపక్ష నేతకు సింగిల్‌ బెడ్‌రూం కూడా ఈ ప్రభుత్వం కేటాయించడం లేదు. తాత్కాలిక అసెంబ్లీలో  బీజేపీ వాళ్లకు కనీసం రూం కూడా కేటాయించలేదు. వాళ్లు అడిగితే తప్ప  చంద్రబాబు ఇచ్చేలా లేరు. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలను తాత్కాలిక అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేయకపోవడం దారుణం. ఆ విగ్రహాలను పెడితే మీరు చేసే మోసాలను చంపుకొని నడవాల్సి వస్తుందనే ఏర్పాటు చేయడం లేదు.  చంద్రబాబు ఆక్రమించుకున్న ఇంట్లో ఉంటున్నారు. జూబ్లీహీల్స్‌లో ఈ రోజు వందల కోట్లతో ఇళ్లు కట్టుకుంటున్నారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇల్లు కొనుగోలు చేసి మరీ ఇక్కడికి వస్తారు. నెలలో 20 రోజులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
Back to Top