గందరగోళం సృష్టించేందుకే సీఎం నోటీసు

హైదరాబాద్ :

ప్రజలను గందరగోళంలో పడేయాలనే ఉద్దేశంతోనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య తీర్మానం నోటీసు ఇచ్చారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ నోటీసుపై కిరణ్ వివరణ ఇవ్వాలని ‌వారు డిమాండ్‌ చేశారు. స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కు నిబంధనలు తెలిసినప్పటికీ కాంగ్రెస్ ‌అధిష్టానం ఆదేశాలతోనే సమైక్య డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు.

‘సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‌అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచీ మేం ఇదే పట్టుబట్టాం. అయితే బిల్లు వచ్చినపుడు తీర్మానం చేద్దామని సీఎం దాటవేశారు. బిల్లు రావచ్చని తెలిసినపుడు, సభ ప్రారంభ సమయంలోనూ చెప్పాం. ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ లేఖ ‌కూడా రాశారు. ఆనాడు స్పందించలేదు. పైగా మమ్మల్ని పోలీసులతో అసెంబ్లీ నుంచి గెంటించారు. సమైక్యాంధ్ర కోసం మేం చేసే పోరాటానికి ఎక్కడ మైలేజీ వస్తుందో అనే దురుద్దేశంతో సీఎం కిరణ్ ఇదంతా చేశారు. టీడీపీ ‌సభ్యులు వారికి వంతపాడుతూ చర్చల్లో మేం పాల్గొనకపోవడం ద్రోహం అని విమర్శలు గుప్పించార'ని ఎమ్మెల్యేలు ఆరోపించారు.

ఇన్నాళ్ళూ వైయస్ఆర్‌సీపీని విమర్శించి ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. పది రోజుల గడువు ఉన్నపుడే నోటీసు ఇవ్వాలని సీఎంకు తెలిసినప్పటికీ ఆలస్యంగా నోటీసు ఇచ్చారు. సభాపతిగా పనిచేసిన కిరణ్‌కు నిబంధనలు తెలియవా? అని ప్రశ్నించారు. సీఎం ఈ అంశంలో వివరణ ఇవ్వాలి’అని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

తనకంటే అనుభవజ్ఞుడు లేడని చెప్పుకునే చంద్రబాబు మనసులో రాష్ట్ర విభజన కావాలనే ఉందని కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. విభజన తమ వల్లే జరిగిందని చెప్పుకొని తెలంగాణలో లోకేశ్‌తో ప్రచారం చేయించడం, సమైక్యంగా ఉంచేందుకు పాటుపడ్డామని చెప్పి సీమాంధ్రలో ప్రచారం చేసుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు టీడీపీని తరిమికొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

Back to Top