ప్రజాసమస్యలు పట్టని సర్కార్

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు
నీటి ఎద్దడిని నివారించడంలో విఫలం
ప్రజాసమస్యలు గాలికొదిలి ఎమ్మెల్యేలకు ఎర
ప్రధాని, రాష్ట్రపతి, ఈసీ దృష్టికి ఫిరాయింపుల వ్యవహారం
ప్రభుత్వ దుర్మార్గాలపై నిరసన సెగలు
ఈనెల 25న ఖాళీ బిందెలతో నిరసన
మే 2న జిల్లా కేంద్రాల దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన

హైదరాబాద్ః  భానుడి భ‌గ‌భ‌గ‌ల‌ను త‌ట్టుకోలేక రాష్ట్రంలో ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతుంటే... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి పార్థ‌సార‌ధి మండిపడ్డారు. క‌రువు, నీటిఎద్ద‌డికి సంబంధించి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోని కారణంగానే ఈపరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సాగు, తాగునీటి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవడం మానేసి.. ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డంపైన దృష్టి సారించడం సిగ్గుచేటని టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. 

క‌రువు పరిస్థితులను శాశ్వ‌తంగా ప‌రిష్కరించ‌గ‌లిగే ప్రాజెక్టుల్ని, రాష్ట్రానికి రావాల్సి నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు ముందుకు రాని ప్రభుత్వం....రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఫిరాయింపుదారుల‌ను మాత్రం ప్రోత్సహిస్తుందని ఫైరయ్యారు.  రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కు ఏన్నడూ లేని విధంగా ప‌శువులు క‌బేళాలకు త‌ర‌లిపోతున్నాయ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌రువు పరిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు...తన హయాంలో ప‌శుక్రాంతి ప‌థ‌కం పేర పేద‌ల‌కు ఉచితంగా ప‌శువుల‌ను అందజేశార‌ని గుర్తు చేశారు. కానీ, బాబు  ప‌శువుల‌కు కనీసం నీటిని కూడా స‌మ‌కూర్చ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

వ‌డ‌దెబ్బ‌, ఎండ‌వేడిమిని త‌ట్టుకునేందుకు హెరిటేజ్ మ‌జ్జికను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ంటూ బాబు కోట్ల రూపాయిలు చెల్లించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. నీటి ఎద్ద‌డి ఉన్న రాష్ట్రాల్లో  ఆయా ప్రభుత్వాలు రైళ్ల ద్వారా నీటిని అందిస్తున్నా...చంద్రబాబు మాత్రం క‌రువుపై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించ‌డం సిగ్గుచేట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ, కోట్లాది రూపాయ‌లు ఎర‌చూపి ఎమ్మెల్యేలను కొంటున్న తీరును నిరసిస్తూ ....సేవ్ డెమోక్రసీ పేరున  ఈ నెల 25న ప్ర‌తి జిల్లా కేంద్రంలో కొవ్వుత్తుల ప్ర‌ద‌ర్శ‌న నిర్వహిస్తామన్నారు. కరువుపై ప్రభుత్వం అలసత్వానికి నిర‌స‌న‌గా మే 2న అన్ని మండ‌ల కేంద్రాల్లో ఖాళీ బిందెల‌తో నిర‌స‌న‌లు తెలుపుతామన్నారు. 

నీటి ఎద్ద‌డిని ప‌రిష్కరించడంలో  టీడీపీ విఫ‌లం
వైఎస్సార్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి అనంత వెంక‌ట్రామిరెడ్డి 
తాగునీటి ఎద్ద‌డిని ప‌రిష్కరించ‌డంలో టీడీపీ విఫ‌ల‌మైందని  వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రాంరెడ్డి అన్నారు. త్వరలోనే   వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంద‌రు...ఫిరాయింపులను ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్రపతి, ఈసీ దృష్టికి తీసుకెళ్తారని అనంత స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయడం అనైతిక చర్యగా అభివర్ణించారు. అదేవిధంగా గత ఏడాదికి సంబంధించిన పంట‌న‌ష్ట ప‌రిహారం... ఇంత‌వ‌ర‌కు రైతుల‌కు చెల్లించ‌లేద‌ని ఆయ‌న ఆగ్రహం వెలిబుచ్చారు.  సుప్రీంకోర్టు సైతం ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా నిధులు విడుద‌ల చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నిధులను కూడా బాబు తన కార్యకర్తలకు దోచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. 
Back to Top