అసెంబ్లీకి క్యాలీఫ్లవర్లతో వైయస్ఆర్‌సీపీ సభ్యులు

హైదరాబాద్, 19 డిసెంబర్ 2013 :

సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని తెలియజెప్పేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గురువారం చెవి వద్ద క్యాలీఫ్లవర్‌ పువ్వులు పెట్టుకుని, నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించవద్దంటూ, తెలంగాణ బిల్లుపై చర్చకు ముందే సభలో సమైక్య తీర్మానం చేయాలంటూ పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. సీఎం కిరణ్‌ ఉత్తర కుమారుడిలా సమైక్యం అంటూ ప్రగల్భాలు పలికారని విమర్శించారు. ప్రజల చెవిలో కాలీఫ్లవర్‌ పువ్వులు పెట్టిన కిరణ్‌ విధానాన్ని ఎండగట్టేందుకే తాము ఇలా నిరసన వ్యక్తంచేశామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప మరే అంశాన్నీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఆమోదించబోదన్నారు. వీర సమైక్యవాదిగా ఫోజు కొడుతున్న కిరణ్‌ ఓ కాగితపు పులి అని వ్యాఖ్యానించారు.

కేబినెట్‌ నోట్‌ తయారు కాక ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేద్దామంటే ఈ ఉత్తర కుమారుడు పట్టించుకోలేదని పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో బిల్లు వచ్చే రోజు అనారోగ్యం నెపంతో సీఎం తప్పించుకోవడం వెనుక ఏదో మతలబు ఉందని వారు ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం శ్రమకు ఓర్చి సమ్మె చేసిన ఎన్జీవోలు ఒక్కొక్కరినీ కిరణ్‌ బెదరించి పవిత్రమైన ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు కిరణ్‌ చెప్పే అబద్ధాలను నమ్మవద్దని, సరైన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, అసెంబ్లీ సమావేశాల్లో గురువారంనాడు కూడా నిన్నటి సంఘటనలే పునరావృతం అయ్యాయి. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన రెండు నిమిషాల్లోనే గంట పాటు వాయిదా పడ్డాయి. స్పీకర్ సభలోకి వచ్చేసరికే ఇరు‌ ప్రాంతాల సభ్యులంతా పోడియాన్ని చుట్టుముట్టారు. తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో సభ మార్మోగిపోయింది.

ప్రతిపక్షాలు సభలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ యధావిధిగా తిరస్కరించటంతో చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ సభ్యులు పట్టుబట్టారు. దానితో సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. శాసనసభలో గందరగోళం నెలకొనటంతో సమావేశాలను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top