ఆంధ్రరాష్ట్రాన్ని మోసం చేసింది చంద్రబాబే

ప్రజల ఆకాంక్షలపై ముఖ్యమంత్రి నీరుచల్లారు
హోదా సంజీవని కాదని ప్రజలను కించపరిచేలా సీఎం మాటలు
మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్యాకేజీని అంగీకరించారా బాబూ
హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలకు సిద్ధపడాలి
అనంతపురం: విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రరాష్ట్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవడంతో మరోసారి మోసానికి గురవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే బాగుపడుతుందని ఆశించిన ప్రజలపై చంద్రబాబు నీరుచల్లారని మండిపడ్డారు. హోదా కోసం ఎందాకైనా అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విశ్వేశ్వర్‌రెడ్డి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో 15 సంవత్సరాలు హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారన్నారు. ప్రత్యేక హోదా కోసం నాలుగుసార్లు రాష్ట్రవ్యాప్త బంద్‌లు చేయడం జరిగిందన్నారు. హోదా సాధిస్తామన్న చంద్రబాబు సంజీవని కాదు.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందాయా అని ప్రజల ఆకాంక్షలను కించపరిచేలా మాట్లాడరన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీని స్వాగతించాడన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగేదేమీలేదని గ్రహించిన ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారన్నారు. అందుకే నాలుగో సారి చేసిన బంద్‌ను ఊహించని రీతిలో విజయవంతం చేశారన్నారు. 
అనుభవం గల నేతకు హోదా లాభాలు తెలియకపోవడం విడ్డూరం
దేశంలోని రాజకీయ నాయకులందరిలో అనుభవం గల నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు హోదా వల్ల కలిగే లాభాల గురించి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. హోదా సాధ్యం కాదని కేంద్రం చెబితే నమ్మి ప్యాకేజీని స్వాగతించారా.. లేక మీ స్వార్థ ప్రయోజనాల కోసం అంగీకరించారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం శాసనసభలో రెండుసార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన అంశాన్ని ఎందుకు నీరుగార్చారని చంద్రబాబును నిలదీశారు. ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించే ముందు అసెంబ్లీలో సభ్యులతో చర్చించారా అని విరుచుకుపడ్డారు. రూ. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. వృద్ధిరేటు బాగుందని అవాస్తవాలు చెబతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఎంపీలతో రాజీనామా చేయించడం లేదని, అవిశ్వాస తీర్మానానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పూటకో మాట, క్షణానికి ఒక నిర్ణయం తీసుకోవడం న్యాయమేనా అని విమర్శించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top