ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అరెస్ట్

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు సోమవారం అనంతపురం నగరంలో చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. పోలీసుల ఏకపక్ష తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ సహా 500 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నగరంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

అంతకుముందు వైఎస్ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని విశ్వేశ్వర రెడ్డి, శంకర్ నారాయణలు ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడటంలో చంద్రబాబు విఫలమయ్యారని, వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ ఆ పార్టీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రసాద్ రెడ్డి హత్య కేసును పక్కనపెట్టి, తమపై అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top