చంద్రన్నసుత్తి టైపులో అసెంబ్లీ

ఒక తీర్మానానికి నాలుగున్నర గంటల ప్రసంగమా?
ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించాల్సిన బాధ్యత లేదా
మెటల్‌ అంశంపై మాట్లాడి మెంటలెక్కించిన చంద్రబాబు
ఆఖరి బడ్జెట్‌లో నిరాశ పరిచిన టీడీపీ సర్కార్‌
మేనిఫెస్టోను ఎందుకు దాచారో చెప్పాలి
బీసీలకిచ్చిన 110 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?
బాబు చొక్కా పట్టుకొని అడిగే హక్కు ప్రతిపక్షానికి ఉంది
ఈ–బ్రిక్స్‌లో ఇటుకలమ్మిన డబ్బు ఏం చేశారు
నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడు
పబ్లిసిటీ పిచ్చితో నలుగురిని బలితీసుకున్న చంద్రబాబు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి


హైదరాబాద్‌: చంద్రన్న సుత్తి కానుక టైపులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. సభలో మెటల్‌ అంశంపై మాట్లాడుతూ.. చంద్రబాబు అందరికీ మెంటల్‌ ఎక్కించేస్తున్నాడన్నారు. ప్రతిపక్షం సభలో లేదనే ధ్యైరంతో టీడీపీ ప్రెస్‌మీట్ల మాదిరిగా సభను నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధర లేక, రుణమాఫీ కాక రైతులు అల్లాడుతున్నారని, అదే విధంగా డ్వాక్రా సంఘాల పరిస్థితి దయనీయంగా ఉందని, నిరుద్యోగుల దుస్థితి వంటి కీలకమైన అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించకపోవడం దుర్మార్గమన్నారు.
ప్రజా సమస్యలపై సభలో చర్చించరా?
రాష్ట్ర ప్రజల కష్టాలపై ఆలోచన లేకుండా తన పార్టీ నేతలతో తీర్మానాలు ప్రవేశపెట్టించుకొని నాలుగున్నర గంటలు చంద్రబాబు చెప్పిందే చెప్పుకుంటూ చంద్రన్న సుత్తి కానుక మాదిరిగా మాట్లాడుతున్నారన్నారు.
ప్రతి బీఏసీ మీటింగ్‌లో ప్రత్యేక హోదాపై చర్చించాలని వైయస్‌ఆర్‌ సీపీ గతంలో కోరినా పరిగణలోకి తీసుకోలేదని, ప్రజా సమస్యలపై సభ రెండు రోజులు పొడిగించండి అని కోరినా వినిపించుకోలేదన్నారు. కానీ తనను పొడిగించుకునేందుకు మాత్రం అసెంబ్లీ సమావేశాలను పొడిగించారని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం సమావేశాలు జరపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
నెట్‌లో కూడా దొరకని టీడీపీ మేనిఫెస్టో
ఆఖరి రాష్ట్ర బడ్జెట్‌ అయినా అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తుందనుకుంటే నిరాశే మిగిలిందని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 2014లో 600ల హామీలిచ్చిన చంద్రబాబు వాటిల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎవరైనా పార్టీ ప్రింట్‌ చేసిన మేనిఫెస్టోను గర్వంగా పట్టుకొని తిరుగుతారని, కానీ టీడీపీ నేతలకు వారి మేనిఫెస్టో చూస్తే కారం చల్లినట్లుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే దాన్ని నెట్‌లో దొరక్కుండా చేశారన్నారు. అంతే కాకుండా ‘ఆయనొస్తే బాగుంటుంది’ అనే వీడియోలు కూడా యూట్యూబ్‌లో లేకుండా చేశారన్నారు. మీ మేనిఫెస్టోలో అశ్లీల దృశ్యాలు ఉన్నాయా..? లేక మాట్లాడలేని భాష ఉందా..? లేక నిషేదించిన మార్కెస్ట్ మావో సాహిత్యం ఏమైనా ఉందా చంద్రబాబూ అని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలకు 110 హామీలిస్తూ మేనిఫెస్టోలో పెట్టారని.. వాటిలో ఒక్కటైనా నెరవేర్చలేదన్నారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, నరేంద్రమోడీ, ఆఖరికి వెంకయ్య నాయుడు ఫొటోలు పెట్టి కూడా పబ్లిసిటీ చేయించుకున్నాడని.. అవన్నీ ఇప్పుడు ఎందుకు కనబడకుండా చేశారో చెప్పాలన్నారు. జిల్లాల వారీగా అభివృద్ధి హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇవేవీ చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న నిన్ను ఎందుకు వదిలేయాలి.. చంద్రబాబును చొక్కా పట్టుకొని అడిగే  హక్కు ప్రజలకు, ప్రతిపక్షానికి ఉందన్నారు.  
ఆ క్రెడిట్స్‌ మీరే తీసుకోండి బాబూ
ప్రత్యేక  హోదా ఉద్యమంలో చంద్రబాబు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రావాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. హోదా కోసం రాజీనామాలు చేయడానికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. టీడీపీ ఎంపీలతో కూడా చంద్రబాబు రాజీనామాలు చేయిస్తే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ఒకవేళ క్రెడిట్స్‌ వైయస్‌ఆర్‌ సీపీకి వస్తుందనుకుంటే మీరే ముందు రాజీనామాలు చేస్తే మీ వెంట మేము వస్తామన్నారు. ఆ క్రెడిట్స్‌ మీరే తీసుకోండి అని సూచించారు. కానీ ఒక పూట ఉద్యమం.. మరోపూట రాజీ అంటే కుదరదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి క్రెడిట్స్‌ అవసరం లేదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు.
సంస్కారం అడ్డం వచ్చి ఆగుతున్నాం..
ఈ–బ్రిక్స్‌ పేరుతో రాజధాని ఇటుకలు అమ్మిన డబ్బును ఏం చేశావు చంద్రబాబూ అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. ఇప్పటి వరకు రాజధాని, పోలవరం పేరుతో దోచుకున్న సొమ్ము కాకుండా ఇంకా నీకు ప్రజలు అప్పులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. నీరు చెట్టు పథకం కింద టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వం వందల కోట్లు దోచిపెట్టిందని, ముందు అక్కడి నుంచి వసూలు చేయడం మొదలు పెట్టాలని సూచించారు. డ్రామాలు ఆడుతూ ఇంతకాలం ప్రజల మభ్యపెట్టింది చాలని, ఇప్పటికైనా నాలుగేళ్లుగా మోసం చేశానని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన చంద్రబాబును భయంకరంగా దూషించాలని ఉన్నా.. సంస్కారం అడ్డం వచ్చి ఆగుతున్నామని, ఇప్పటికీ చంద్రబాబు చెప్పే మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిల్లో లేరన్నారు.  
ఒంటిమిట్ట ఘటన బాధాకరం..
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో ఒంటిమిట్టలో నలుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట రామాలయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పొయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు గతంలో పుష్కరాల్లో 30 మందిని బలితీసుకున్నారని, ఇప్పుడు నలుగురిని పొట్టనబెట్టుకున్నారని విరుచుకుపడ్డారు. పోలీసులు, అధికారుల అప్రమత్తతతో భారీ ప్రాణనష్టం తప్పిందని, ప్రభుత్వం క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా పెంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని పార్టీ తరుపున గడికోట కోరారు.

Back to Top