టీడీపీ ఎంపీలను తరిమికొట్టండి

– ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వైయస్‌ జగన్‌ అండగా ఉన్నారు
– వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల దీక్షలపై టీడీపీ నేతల కామెంట్లు సిగ్గుచేటు
– టీడీపీకి పదవులు ముఖ్యమా? ప్రజల పక్షమా?

ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలను తరిమికొట్టాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఎంపీల ఆమరణ నిరాహార దీక్షలో ఎమ్మెల్యే రోజా పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశంలో ఏ పార్టీ కూడా చేయని సహాసం వైయస్‌ఆర్‌సీపీ చేస్తుందన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైయస్‌జగన్‌ ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు. వైయస్‌జగన్‌ గుంటూరులో 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. ఆనాడు తాత్కాలిక ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారని వైయస్‌ జగన్‌ దీక్షను భగ్నం చేయించారన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన చరిత్ర వైయస్‌ఆర్‌సీపీ అన్నారు. హోదా అంశానికి ఊపిరి పోసిన ఘనత వైయస్‌ జగన్‌ది అన్నారు. ఈ రోజు పార్లమెంట్‌లో వీరోచితపోరాటం చేసి, తమ పదవులను త్యాగించి ఆమరణ దీక్షలు చేస్తున్నారన్నారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిలు వయస్సులో పెద్దవారైనా కూడా ప్రాణాలను ప్రణంగా పెట్టి దీక్షలు చేపట్టారన్నారు. నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత పదిహేనేళ్లు ప్రత్యేక హోదా తెస్తామన్న చంద్రబాబు మాటతప్పారన్నారు. ప్రజల్లో ప్రత్యేక హోదాపై చైతన్యం తెచ్చారన్నారు. చంద్రబాబు ఎందుకు తన ఎంపీలతో రాజీనామా చేయించి ఆమరణ దీక్షలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ఏరు దాటక ముందుకు ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదన్నారు. పార్లమెంట్‌ ముగియగానే ఇళ్లకు పరుగులు తీసిన టీడీపీ ఎంపీలు వైయస్‌ఆర్‌సీపీపై విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. వీధి నాటకాలు వేసుకుంటూ డ్రామాలు ఆడటం బాధాకరమన్నారు. ఢిల్లీలో మోడీ ఇంటి వద్ద మెరుపు ధర్నా అంటూ మీడియా లైవ్‌ల కోసం, పబ్లిసిటి కోసం రోడ్లపై చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను సమాధి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారన్నారు. ఆయన ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి  ఏ పార్టీ వెళ్లలేదంటే అది ఏకపక్షమే అన్నారు. చంద్రబాబు ఆంధ్ర ద్రోహి అని అభివర్ణించారు. చంద్రబాబు తను చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఆయన ఎంపీలతో రాజీనామా చేయించి ఆమరణదీక్షలు చేపట్టాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారని, టీడీపీ కూడా ఇలాంటి పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణంలో ఏవిధంగా రాజకీయ సంక్షోభం సృష్టించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారో అలాగే మనం ప్రత్యేక హోదాను సాధించుకుందామన్నారు. కలిసి కట్టుగా పోరాడితేనే ప్రత్యేక హోదా వస్తుందని రోజా పేర్కొన్నారు. అవినీతితో రాష్ట్రాన్ని దోచుకుని పాలనను ఈ రోజు గాలికి వదిలేసి వైయస్‌ఆర్‌సీపీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.  ఎన్‌టీఆర్‌ కుమారుడు బాలకృష్ణ ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వారికి ప్రజలు, ప్రజా సంక్షేమం, భవిష్యత్తు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మీరు పదవుల పక్షమా?ప్రజల పక్షమా తేల్చుకోవాలని రోజా ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసే వరకు తరిమితరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
 
Back to Top