ప్రతీ వైఫల్యాన్ని ప్రతిపక్ష పార్టీపై రుద్దడం దురదృష్టకరం


బాధ్యతను మర్చిపోయి దుష్ప్రచారం చేస్తారా?
దాచేపల్లి ఘటన వైయస్‌ఆర్‌ సీపీకి అంటగట్టడం సిగ్గుచేటు
లైంగిక దాడికి పాల్పడిన సుబ్బయ్య టీడీపీ నేతే
చంద్రబాబు సంతకంతో సభ్యత్వం కూడా ఇచ్చారు
బాలకృష్ణ కాల్పుల కేసులో బాబును విచారిస్తే బాగుండేదా..?
బాలిక పేరు, కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించొద్దనే కనీస నిబంధన తెలియదా..?
సెటిల్‌మెంట్లు చేసే నువ్వా నేరస్తులను నిలదీసేది.. చంద్రబాబూ
నిన్ను నమ్మి ర్యాలీలకు రావాలా..?
అసమర్థ పాలనను అంగీకరించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి
వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ

విశాఖపట్నం: ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మర్చిపోయిన చంద్రబాబు ప్రతీ వైఫల్యాన్ని ప్రతిపక్ష పార్టీపై రుద్దడం దురదృష్టకమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. రాజధానిలో భూములు కాలిపోయినా.. తునిలో రైతు తగలబడినా వైయస్‌ఆర్‌ సీపీ కారణం అంటూ చంద్రబాబు తన తప్పులను ప్రతిపక్షంపై నెడుతున్నాడని మండిపడ్డారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆర్కే రోజా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 55 ఏళ్ల వృద్ధుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేస్తే ఆ నిందితుడు వైయస్‌ఆర్‌ సీపీకి చెందిన వాడని టీడీపీ ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య టీడీపీలో ఉన్నాడు.. లోకేష్‌ టీమ్‌ ఇచ్చిన టీడీపీ సభ్యత్వంలో చంద్రబాబు సంతకం కూడా ఉందని చూపించారు. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సుబ్బయ్య కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములుంటే వారిలో ఒకరు టీడీపీ, కమ్యూనిస్టు, వైయస్‌ఆర్‌ సీపీలలో ఉన్నారని స్పష్టం చేశారు. జన్మభూమి కమిటీలతో సంకతం చేయించి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ సుబ్బయ్యకు ఇల్లు కూడా మంజూరు చేయించారని, సిగ్గులేకుండా యరపతినేని, సన్నపనేని రాజకుమారి మాట్లాడుతున్నారన్నారు. సుబ్బయ్య టీడీపీకి చెందినవాడేనన్న నిజాలకు ఏం సమాధానం చెబుతారన్నారు. 
నీకూ మతిస్థిమితం లేనట్లేనా?
సినీ నిర్మాత బెల్లకొండ సురేష్‌పై బాలకృష్ణ కాల్పులు జరిపినప్పుడు చంద్రబాబును తీసుకెళ్లి విచారణ చేస్తే బాగుండేదా..? బాలకృష్ణకు మతిస్థిమితం లేదని సర్టిఫికెట్‌ ఇచ్చారు.. అంటే చంద్రబాబుకు కూడా లేనట్లేనా..? ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబూ అని ప్రశ్నించారు. 
వైయస్‌ఆర్‌ సీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం..
ఆడపిల్ల జీవితం నాశనమై ఆ కుటుంబ సభ్యులు బాధ, అవమానంతో తలదించుకొని ఉంటే.. చంద్రబాబు సిగ్గులేకుండా బాధితురాలి పేరును ప్రకటించడమే కాకుండా.. పబ్లిసిటీ కోసం బాధిత కుటుంబ సభ్యులను మీడియా ముందుకు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతారా..? సిగ్గులేదా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కనీస నిబంధనలు కూడా తెలియవా.. అని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుంటే.. దాన్ని రాజకీయంగా టీడీపీ చిత్రీకరిస్తుందన్నారు. నాలుగేళ్లుగా ఆడవారిపై అనేక అత్యాచారాలు జరిగాయి.. వారిలో ఎవరినైనా కలిశారా..? ఎవరికైనా న్యాయం చేశారా..? అని చంద్రబాబును నిలదీశారు. ప్రభుత్వ తప్పును వైయస్‌ఆర్‌ సీపీ బట్టబయలు చేయడంతో చంద్రబాబు దిగివచ్చిందన్నారు. 
ప్రభుత్వం నీళ్లు లేని బావి చూసుకొని దూకాలి..
టీడీపీ పరిపాలనలో ఆడవారికి రక్షణ కరువైనందుకు చంద్రబాబు సర్కార్‌లోని పెద్దలు నీళ్లు లేని బావి చూసుకొని దానిలో దూకాలన్నారు. ఎవరి మీద నువ్వు ర్యాలీ పెడతున్నావు చంద్రబాబూ..? నీ అసమర్థ పాలనపై ర్యాలీ పెడితే... దానికి వైయస్‌ఆర్‌ సీపీ సంఘీభావం తెలపాలా..? అని ప్రశ్నించారు. పోలీసులను పనిచేయనివ్వకుండా.. మీటింగ్‌లకు జనాలను తోలించడానికి, కబ్జాలకు సెటిల్‌మెంట్‌లు చేయడానికి వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. నేరస్థులకు అండగా ఉన్నా నీకు సంఘీభావం తెలపాలా..? తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా ఆడవారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తాజాగా ఏడీఆర్‌ ఇచ్చిన రిపోర్టులో మహిళలపై దాడులకు పాల్పడిన ప్రజాప్రతినిధులు ఐదుగురు టీడీపీ వారే ఉన్నారన్నారు. వారిలో ఇద్దరు మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని, ఎమ్మెల్యేలు చింతమనేని, ధర్మవరపు సూరి, బండారు సత్యనారాయణ ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ఇప్పటి వరకు వారిని సస్పెండ్‌ చేయకుండా పార్టీలో కొనసాగించే నువ్వా నేరస్థులను నిలదీసేది చంద్రబాబూ అని విరుచుకుపడ్డారు. 
800లకుపైగా కేసులు కొట్టేస్తే.. నేరస్తులను రక్షిస్తున్నట్లా.. కాదా..?
అధికారంలోకి రాగానే జీవోలు విడుదల చేసి టీడీపీ నేతలపై ఉన్న 800లకు పైగా కేసులను కొట్టేసిన చంద్రబాబు నేరస్థులను రక్షిస్తున్నట్లా.. కాదా.. సమాధానం చెప్పాలని రోజా డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తే పోరాటాలు.. వైయస్‌ఆర్‌ సీపీ బాధ్యతగా పోరాడితే.. అవి రాజకీయాలుగా చిత్రీకరించడం దౌర్భాగ్యమన్నారు. వైజాగ్‌లో బీచ్‌షోలు, బికినీ షోలు, బీర్‌పార్లర్‌లు పెట్టేందుకు యత్నిస్తే వైయస్‌ఆర్‌ సీపీ అడ్డుకుందన్నారు. టీడీపీకి చెందిన మైనార్టీ ప్రజాప్రతినిధి జానీమూన్‌కు మంత్రి రావెల కిషోర్‌తో ప్రాణహాని ఉందని చెప్పినా.. న్యాయం జరిగకపోతే వైయస్‌ఆర్‌ సీపీ నిలదీస్తే అప్పులు చంద్రబాబు సెటిల్‌మెంట్‌ చేశారని గుర్తు చేశారు. అదే విధంగా రిషితేశ్వరి తల్లిదండ్రులు సీఎంను కలవడానికి క్యాంపు ఆఫీస్‌ చుట్టూ తిరిగినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలందరినీ ఆ కాలేజీకి పంపించగానే చంద్రబాబు భయంతో రిషితేశ్వరి తల్లిదండ్రులను హోటల్‌కు పిలిపించి సెటిల్‌మెంట్‌ చేశారన్నారు.  కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తే ఆ స్కాంలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోడే ప్రసాద్‌ ఉన్నారని, ఆ విషయాన్ని డైవర్ట్‌ చేసే విధంగా తనను సంవత్సరం పాటు సస్పెండ్‌ చేశారని రోజా మండిపడ్డారు. పచ్చఛానళ్లు మార్ఫింగ్‌ చేసి దొంగ వీడియోలు ప్రసారం చేశాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఆ వీడియోలను టెస్టింగ్‌కు పంపించాలని డిమాండ్‌ చేశారు. 
గురువారం ఒక్కరోజే 11 కేసులు
నేరస్తులను శిక్షించాల్సిన చంద్రబాబు వారికి కొమ్ముకాస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి చిన్నరాజప్ప దాచేపల్లి ఘటన ప్రభుత్వ తప్పిదమే అని ఒప్పుకున్నాడన్నారు. జనవరి 6వ తేదీ నుంచి మొన్నటి వరకు 6 కేసులు నమోదైతే.. గురువారం ఒక్కరోజే 11 అత్యాచారాలు కేసులు నమోదయ్యాయన్నారు. వీరందరినీ చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. వీరిలో కూడా పసిపాపలు ఉన్నారని, బాధితులకు ఎక్స్‌గ్రేషియా, ఉచితంగా చదువులు చెప్పించరా.. అని నిలదీశారు. 2014లో 16,526 మంది మహిళలపై, 2015లో 15,967, 2016లో 16,362 మంది మహిళలపై దాడులు జరిగినట్లుగా క్రైం రేటు నమోదైందన్నారు. ఎమ్మార్వో వనజాక్షి కేసులో నేరస్తుడైన ఎమ్మెల్యేను శిక్షించాల్సింది పోయి చంద్రబాబు దగ్గరుండి సెటిల్‌మెంట్‌ చేశాడని, అదే విధంగా ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యంను ఎంపీ, ఎమ్మెల్యే దుర్భాషలాడి.. గన్‌మెన్‌పై దాడి చేస్తే వారిని శిక్షించాల్సింది పోయి సెటిల్‌మెంట్‌ చేసిన నువ్వా నేరస్తులను నిలదీసేది చంద్రబాబూ అని దుయ్యబట్టారు. నిన్ను నమ్మి ర్యాలీలకు రావాలా.. ఏం మాట్లాడుతున్నావ్‌ చంద్రబాబూ అని ఫైరయ్యావు. 
ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు..
వేలమంది మహిళల జీవితాలను నాశనం చేసిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని రోజా అన్నారు. అమెరికాలో దాడి జరిగితే దాన్ని ఖండిస్తారు.. జమ్ముకాశ్మీర్‌లో ఘటన జరిగితే.. ప్రదాని బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన చంద్రబాబు.. ఇన్ని వేలమంది ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగితే.. అసమర్థతను ఒప్పుకొని రాజీనామా చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. 55 ఏళ్ల ముసలివాడిని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఏపీని పాలిస్తుందన్నారు. దాచేపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో సుబ్బయ్య చనిపోతే పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. శవాన్ని పట్టుకోవడానికి 48 గంటలు పట్టిందంటే.. 17 ప్రత్యేక బృందాలు గాడుదులు కాస్తున్నాయా అని విరుచుకుపడ్డారు. రోజా పార్ట్‌టైం ఎమ్మెల్యే అన్న హోంమంత్రి మాటలను ఖండించారు. మరి మీరు ఫుల్‌టైం ఉండి మహిళలపై దగ్గరుండి దాడులు చేయిస్తున్నారా అని ప్రశ్నించారు. విశాఖలో ఆడపిల్లను తగలబెట్టిన వారు ఎవరో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. 
అన్నలా, తమ్ముడిలా వైయస్‌ జగన్‌ పాలన అందిస్తారు..
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని రోజా స్పష్టం చేశారు. సొంత అన్న, తమ్ముడిలా పాలన అందిస్తారన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే.. ఉరిశిక్ష పడే విధంగా వైయస్‌ఆర్‌ సీపీ పాలన ఉంటుందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా టీడీపీ నేతలకు మహిళలను గౌరవించడం నేర్పించాలని సూచించారు. ప్రభుత్వం మహిళలపై దాడులు చేయిస్తున్న వైనానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీ చేపడుతున్నామని, దాన్ని మహిళలపై గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరారు.  
 
Back to Top