రైతుల శవాల మీద కేకులు కోస్తావా..?

  • శవాల మీద బొరుగులు ఏరుకునే వ్యక్తి చంద్రబాబు
  • లోకేష్‌ కామెడీకి జబర్ధస్త్‌ కూడా సరిపోదు
  • తెలివితేటల్లో జలీల్‌ఖాన్‌ను, అబద్ధాల్లో తండ్రిని మించిపోయిన లోకేష్‌
  • అనంతలో పుట్టిన రోజు జరుపుకోవడానికి సిగ్గనిపించడం లేదా?
  • కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు అందరినీ మోసం చేస్తున్న బాబు
  • గూగుల్‌ కూడా బాబే చీటింగ్ ముఖ్యమంత్రి అంటుంది
  • తండ్రీ కొడుకులిద్దరూ రాష్ట్రాన్ని వాటాలేసుకొని దోపిడీ చేస్తున్నారు
  • వైయస్‌ జగన్‌ రైతు దీక్షను విజయవంతం చేద్దాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
విజయవాడ: కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న చంద్రబాబును శవాల మీద బొరుగులు ఏరుకునే వ్యక్తి అనక ఏమనాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కో రోజా ప్రశ్నించారు. అనంతపురానికి ఏం చేశారని అక్కడ బర్త్‌ డే కేక్‌ కట్‌ చేస్తున్నారని చంద్రబాబును నిలదీశారు. టీడీపీ అరాచక పరిపాలనపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌ అయ్యారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... చంద్రబాబు పరిపాలన మూడు ముక్కల్లో చెప్పాలంటే ముడుపులు.. మోసాలు.. అరాచకాలు తప్ప మరేమీ లేదన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టిన 600 హామీల్లో ఒక్కటి కూడా మనస్ఫూర్తిగా నెరవేర్చిన దాఖళాలు లేవని స్పష్టం చేశారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికి కాళ్లు చాపిన పండు వృద్ధుల వరకు అందరినీ చంద్రబాబు మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.  కడుపులో ఉన్న బిడ్డకు పండండి పథకం కింద రూ. 10 వేలని, ఆడపిల్ల పుడితే రూ. 30 వేలు ఇస్తామని మాతృమూర్తులను మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక్క ఆడపిల్ల పుట్టుక కూడా నమోదు కాలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు అది ఎక్కడైనా అమలైందా..అధికారంలోకి రాగానే హైస్కూల్, ఇంటర్‌ విద్యార్థినీలకు సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు. మూడేళ్లు గడిచింది ఒక్కటైనా పంపిణీ చేశారా.. అని నిలదీశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీస్తే 9వ తరగతి వారికి సైకిళ్లు అందజేశారు. అంటే ఆడపిల్ల ఉన్నత చదవులు చదువుకోవద్దు.. 9వ తరగతి వరకు చదివితే చాలని మీ ఉద్దేశ్యమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

వర్థంతికి ఏం చెప్పాలో.. జయంతికి ఏం చెప్పాలో కూడా తెలియదా..?
చంద్రబాబు తనయుడు లోకేష్‌ కామెడీకి జబర్థస్త్‌ షో కూడా సరిపోదని అందరూ అంటున్నారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. తాగునీటి సమస్య సృష్టించడానికే గ్రామీణ అభివృద్ధి శాఖను ఎంచుకున్నానని చెప్పిన లోకేష్‌ తన మనస్సులో మాటని కరెక్టుగా చెప్పాడని విమర్శించారు. లోకేష్‌ తెలివితేటల్లో జలీల్‌ఖాన్‌ను, అబద్ధాలు ఆడడంలో చంద్రబాబును మించిపోయాడని రోజా ఛలోక్తులు విసిరారు. తండ్రి విదేశాలు తిరిగి ఒక్క ఉద్యోగం ఇప్పించలేదు కానీ రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇస్తానని లోకేష్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వర్థంతికి ఏం చెప్పాలో.. జయంతికి ఏం చెప్పాలో తెలియని వ్యక్తిని మంత్రిని చేశారంటే ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. వర్థంతి ఎవరైనా శుభాకాంక్షలు చెబుతారా అని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీలో అనుభవం ఉన్న నాయకులను పక్కనబెట్టి కనీస రాజకీయ అవగాహన లేని లోకేష్ ను మంత్రిని చేసి కొడుకు బాగు కోసం బాబు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తన నోటిని కంట్రోల్‌ చేసుకోలేని వ్యక్తి సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేసి కేసులు పెడతాననడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అలా కేసులు పెట్టాలనుంటే ముందుగా లోకేష్‌ మీదే కేసులు పెట్టాలని, వైయస్‌ జగన్‌పై ఎన్నెన్నో అవాకులు చవాకులు పేలాడన్నారు. లోకేష్‌ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీలేదని ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైందన్నారు. 

దున్నపోతుల మీద పేర్లురాసినా సిగ్గనిపించడం లేదా?
ఇప్పటి వరకు పాలించిన ముఖ్యమంత్రుల్లో దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎవరని చిన్నపిల్లాడిని అడిగినా చంద్రబాబు అని టక్కున చెబుతాడని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించకుండా పక్కరాష్ట్రంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇంద్రభవనాన్ని కట్టుకున్నావ్‌ సిగ్గులేదా చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్రాన్ని తండ్రి కొడుకులిద్దరూ వాటాలు వేసుకొని దోచుకుంటున్నారని, రాష్ట్రాన్ని రూ. 2 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. తండ్రి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం కుప్పానికే నీళ్లు ఇవ్వలేని లోకేష్‌ రాష్ట్ర ప్రజలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందా.. అని నిలదీశారు. తాగునీటి సమస్య సృష్టిస్తానని అల్లుడు చెప్పగానే మామ బాలకృష్ణ తన నియోజకవర్గంలో అమలు చేశాడని ఎద్దేవా చేశారు. దున్నపోతుల మీద పేర్లు రాసి ఖాళీ బిందెలతో నిరసన తెలిపే పరిస్థితి వచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని చురకంటించారు. తన సొంత నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్య ఇరిగేషన్‌ మంత్రి పులివెందుకుల నీళ్లు ఇచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రైతుల శవాల మీద కేకులు కోస్తావా?
గూగుల్‌లో చీటింగ్‌ అని కొడితే ఏపీ సీఎం చంద్రబాబు అని ఫోటోతో సహా చూపిస్తుందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చీటింగ్‌ చీఫ్‌ మినిస్టర్‌గా రాష్ట్రంలోని రైతులను, యువతను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు విజయవంతంగా చీటింగ్‌ చేశాడని దుయ్యబట్టారు. అలాంటి అవుట్‌డేటెడ్‌ సీఎం కరువు ప్రాంతంలో బర్త్‌డే వేడుక చేసుకునే అర్హత ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1290 మంది రైతులు చనిపోతే దాంట్లో అధికంగా అనంతవాసులే ఉన్నారన్నారు. 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అనంత ప్రజలను ఏం ఉద్దరించారని అక్కడ పుట్టిన రోజు సంబరాలు చేసుకుంటున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. శవాల మీద కేక్‌కట్‌ చేసుకుంటున్న చంద్రబాబును ఏమనాలన్నారు. రెయిన్‌ గన్‌ల పేరుతో రూ. 200 కోట్లు నొక్కేసిన బాబును శవాల మీద బురుగులు ఏరుకునే వ్యక్తి అనక ఏమనాలని విమర్శించారు. తాగునీటి కోసం ప్రజలంతా అల్లాడుతూ వడదెబ్బకు నిత్యం పదుల సంఖ్యలో ప్రజల పిట్టల్లా రాలిపోతుంటే సిగ్గు అనిపించడం లేదా అని చురకంటించారు. కనీసం ఈ పుట్టిన రోజున అయినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తా.. హామీలు నెరవేరుస్తా. అని ఒక ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతుల కోసం ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలన్నారు. రైతు వ్యతిరేకి అయిన చంద్రబాబు మెడలు వంచి హక్కులను కాపాడుకునేలా దీక్షకు రైతులు హాజరుకావాలన్నారు. 
Back to Top