బంద్‌ను విఫలం చేసేందుకు సర్కార్‌ ప్రయత్నాలు


వైయస్‌ఆర్‌ జిల్లా: ఏపీ బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు సర్కార్‌ ప్రయత్నాలు చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం కడప బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బంద్‌ సంపూర్ణంగా జరుగుతుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారన్నారు. పోలీసుల సహకారంతో ఆర్టీసీ బస్సులను బలవంతంగా నడిపించి బంద్‌ను విఫలం చేయాలని కుట్ర చేస్తుందన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు. టీడీపీ నేతలు కూడా బంద్‌లో పాల్గొని మన ఆకాంక్షను కేంద్రానికి చెప్పాల్సిన సమయంలో వారే నీరుగార్చడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టంగా చెబుతున్నా చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించడం లేదన్నారు. ఆ పని ప్రతిపక్షం చేస్తుంటే విఫలం చేయడం దారుణమన్నారు. మోసం చేసే చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మీడియా సహకారం ఉందని తామే పోరాటం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. 
 
Back to Top