మైక్‌ ఇవ్వరు..నిధులు ఇవ్వరు– చంద్రబాబును పొగడటానికి, వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని విమర్శించడానికే అసెంబ్లీ సమావేశాలు
– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పైసా ఇవ్వలేదు

 
వైయస్‌ఆర్‌ జిల్లా:  మైక్‌ ఇవ్వక, నిధులు ఇవ్వక, పార్టీ మారిన వారిపై వేటు వేయకుండా కోట్ల రూపాయాలు ఖర్చు చేసి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం లేదని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. మా నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఉన్నారని, వారికి తాగునీటి సమస్య, వ్యవసాయ రంగ సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. నిరుద్యోగ సమస్యలు, పేదరికంతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పారు. నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతి ఏటా ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు, రూ.3 కోట్ల నిధులు కేటాయించేవారన్నారు. టీడీపీ ప్రభుత్వం వైయస్‌ఆర్‌సీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఇంతవరకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని తప్పుపట్టారు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇలాంటి పాలన చూడలేదన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేస్తూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి చూపుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును, టీడీపీని పొగిడేందుకు, మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శించేందుకు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను పందులు, ఫ్యాక్షనిస్టులు, హంతకులు అని తిట్టించడానికి ప్రజాధనాన్ని ఖర్చు చేసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసేందుకు అసెంబ్లీకి వెళ్లాలని పేర్కొన్నారు. 

 
Back to Top