కపట దీక్షలతో కడప ప్రజలను మోసగిస్తారా?

ఏడ్రోజులైనా రమేష్‌నాయుడు ఎలా ఆరోగ్యంగా ఉన్నారు
కొంతైనా ఆరోగ్యం క్షీణించకపోవడం ఎలా సాధ్యం
కాల్వ శ్రీనివాసు వ్యాఖ్యలు మురికి కాల్వ కూతలు
ఆదినారాయణరెడ్డి కండ్లకావరం ఎక్కి మాట్లాడుతున్నాడు
రాచమల్లు దొంగ అని ప్రొద్దుటూరులో ఒక్కరితోనైనా అనిపించాలి
మంత్రులకు సవాలు విసిరిన ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి
వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే జిల్లా సస్యశ్యామలం
వైయస్‌ఆర్‌ జిల్లా: చంద్రబాబుకు కడప జిల్లాపై ప్రేమ ఉంటే 2014 డిసెంబర్‌లోనే నరేంద్రమోడీ కాళ్లు పట్టుకొనైనా ఉక్కు పరిశ్రమ తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. కేంద్రం కాదంటే భాగస్వామ్యాన్ని తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చి పోరాటం చేస్తే ప్రతిపక్షం సంపూర్ణ మద్దతు ఇచ్చేదన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉక్కు సంకల్పదీక్షకు రాచమల్లు హాజరై మాట్లాడుతూ..  2014 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉక్కు పరిశ్రమ కోసం అధ్యయన కమిటీని నియమించందన్నారు. ఆ కమిటీ ఆరు నెలల తరువాత కేంద్రానికి నివేదిక అందజేసిందని, జిల్లాలో పరిశ్రమ స్థాపించడానికి అనుకూలత లేదని చెప్పిందన్నారు. ఇదే విషయాన్ని మోడీ 2014లో చంద్రబాబు చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోకుండా నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి.. ప్రస్తుతం ప్రజలను మభ్యపెట్టేందుకు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనగా.. ఉక్కు పరిశ్రమ అంటూ ప్రజలను వంచించేందుకు కపట దీక్ష చేస్తున్నారన్నారు. 

ఎంపీ సీఎం రమేష్‌నాయుడు ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నా.. ఆయన ఆరోగ్యం కొంతైనా ఎందుకు క్షీణించలేదో అర్థం కావడం లేదని రాచమల్లు అనుమానం వ్యక్తం చేశారు. కొత్త పెళ్లికొడుకు అత్తారింటికి వచ్చి అల్లం తిన్న మాదిరిగా ఉన్నాడని విమర్శించారు. సుమారు రూ. 16 వందలు విలువ చేసే వాటర్‌ బాటిళ్లలో నీరు తాగుతూ దొంగ దీక్ష చేస్తున్నారన్నారు. ఈ కపట దీక్షకు అమరావతి నుంచి టీడీపీ నాయకులు పనిగట్టుకొని వచ్చి ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన మురుకి కాల్వ శ్రీనివాసులు కడప జిల్లా వారు తినడానికే పుట్టారని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అవును.. సామాన్య రైతు కుటుంబాల్లో పుట్టాం. పచ్చడి మెతుకులు తిని బతికే మనుషులం. నోట్ల కట్టలు తిని బతికే దుర్మార్గులు మీరని కాల్వ శ్రీనివాసులపై విరుచుకుపడ్డారు. 

మంత్రి జవహర్‌కు రాచమల్లు సవాలు విసిరారు. మంత్రులంతా ప్రొద్దుటూరులో పర్యటన చేయండి.. ఒక్కడైనా రాచమల్లు దొంగ అంటే మీ కాళ్ల కింద నుంచి దూరిపోతానన్నారు. దమ్ముంటే మంత్రులు సవాల్‌ స్వీకరించాలన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మాకు నేర్పింది.. సేవా మార్గం. క్షమాగుణాన్ని నేర్పించారని, అందుకే ప్రజల అభిమానాలు చురగొని గెలుస్తున్నామన్నారు.
 
కళ్ల కావరం ఎక్కి మంత్రి ఆదినారాయణరెడ్డి రాజకీయ భిక్ష పెట్టిన వైయస్‌ఆర్‌పై కూడా ఆరోపణలు చేస్తున్నాడని రాచమల్లు మండిపడ్డారు. ఆదినారాయణరెడ్డిని చూస్తే ఒక కథ గుర్తుకు వస్తుందన్నారు. 
ఒక గ్రామంలో డ్రామా వేసినప్పుడు భీముడి పాత్రధారి తాగిపడిపోతే.. ఆ ఊరిలో పనికిమాలిన వాడైన ఆదినారాయణ అనే వ్యక్తిని భీముని పాత్ర వేసేందుకు నిర్వాహకులు తీసుకువచ్చారు. ఆదినారాయణను తీసుకొచ్చి నెత్తిన కిరీటం, లావు మీసాలు, భుజాన గద పెట్టారు. దీంతో అతను భీముడిలా ఫీలయిపోయాడు. మనకెందుకురా ఈ వేషాలు ఇంటికి పోదాం పదా అని అన్న తలకాయ తీసిపారేయండి అని ఆజ్ఞాపిస్తాడు.. తెల్లవారింది.. డ్రామా అయిపోయింది నెత్తిన కిరీటం, మీసాలు, గద తీసేశారు.. అప్పుడు మళ్లీ తాను ఆదినారాయణను అని గుర్తుకు వచ్చి కడవ భుజాన వేసుకొని నీళ్లకు వెళ్లాడన్నారు. అంటే మంత్రి ఆదినారాయణరెడ్డి పరిస్థితి కూడా ఇలాగే తయారూందని, కిరీటం, మీసాలు, గద పెట్టే సరికి బలవంతుడినని ఫీలవుతున్నాడని, తెల్లవారితే డ్రామా అయిపోతుంది.. మంత్రి పదవి ఉండదు.. బుగ్గకారు ఉండదు. శంకరగిరి మాన్యాలు తప్పదన్నారు. సుధీర్‌రెడ్డి కంటే ఆదినారాయణరెడ్డి దేనిలో గొప్ప చెప్పాలన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ నేతలం అన్ని పోగొట్టుకున్నాం కానీ మా దగ్గర విలువ మాత్రమే ఉందన్నారు. కానీ ఆదినారాయణరెడ్డికి అన్ని ఉన్నా విలువ లేదన్నారు. విలువ లేని జీవితం ప్రాణం లేని శరీరంతో సమానమన్నారు.  

కడప ఉక్కు పరిశ్రమ కోసం వైయస్‌ఆర్‌ సీపీ ఏడుగురు ఎమ్మెల్యేలం, ఒక ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమేనా అని చంద్రబాబుకు సవాలు విసిరారు. రాజీనామాకు తొలి సంతకం తాను పెట్టేందుకు సిద్ధమన్నారు. మంత్రి ఆది, సీఎం రమేష్‌నాయుడు సంతకం పెట్టేందుకు రెడీనా అని నిలదీశారు. ప్రజాసేవ కోసం ప్రజలు ఇచ్చిన పదవిని ఆ ప్రజల శ్రేయస్సు కోసం వదులుకోవడం మహానేత వైయస్‌ఆర్, ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ మాకు నేర్పించారన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తెలుగుదేశం దొంగ దీక్షలు చేస్తుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత శంకుస్థాపన చేయించకపోతే.. మూడు సంవత్సరాల్లో ఉక్కును ఉత్పత్తి చేయించలేకపోతే ఎమ్మెల్యే పదవుల పదవులను చిత్తుకాగితాల్లా వదిలేస్తామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. 

Back to Top