ఉక్కు పోరాటం

- ఉక్కు పరిశ్రమ కోసం ఎమ్మెల్యే రాచమల్లు దీక్ష
- వైయ‌స్ఆర్‌సీపీ పోరాటానికి మ‌ద్ద‌తు వెల్లువ‌

వైయస్‌ఆర్‌ జిల్లా: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ప్రొద్దుటూరు రామేశ్వరం నుంచి శివాలయం సెంటర్‌లో రాచమల్లు 48 గంటల దీక్ష ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు లేక నిరుద్యోగ యువత అల్లాడిపోతోందని.. రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినా...ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం పట్ల జిల్లా ప్రజలు రగలిపోతున్నారని.. వెంటనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 


క‌డ‌ప‌లో స‌మృద్ధిగా ఇనుము 
 ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ అమలు కోసం వైయ‌స్ఆర్‌సీపీ మొద‌టి నుంచి పోరాటం చేస్తోంది.   ఉక్కు పరిశ్రమకు పన్ను రాయితీలు, సబ్సిడీలు కల్పిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి డిమాండు చేశారు.  వైజాగ్‌లో స్టీల్‌ ప్లాంటు ఉన్నప్పటికీ ఇనుప ఖనిజాన్ని దూర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటూ నడిపిస్తున్నారన్నారు. అయితే కడపలో నెలకొల్పే పరిశ్రమకు ఇనుప ఖనిజం కావాల్సినంత జిల్లాతోపాటు సీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో స‌మృద్ధిగా ఉంది.  కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పటికే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో  వైయ‌స్ఆర్‌సీపీ ఉక్కు పరిశ్రమ సాధనకు ప‌లుమార్లు ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.  ప్రజలు ఉక్కు ఫ్యాక్టరీ విషయమై ఇప్పటికే ఎన్నో ఆశలతో ఉన్నారు. 

ఉక్కు ప‌రిశ్ర‌మ ఓ వ‌రం
రాయలసీమ జిల్లాలకు సంబంధించి కడప నడిబొడ్డున ఉంది. అందులో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ‘సీమ’లో ఒక్క పెద్ద ప్రాజెక్టు లేదు.  ఉక్కు పరిశ్రమ సీమకు వరం లాంటిది. సీమలో ఉన్న  నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్లు ఉంటుంది.  అంతేకాకుండా వేలాదిమంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని కడపలో స్టీల్‌ ప్లాంటును ఏర్పాటు చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్‌ చేశారు.
 
Back to Top