ముస్లింల పాలిట సైతాన్ చంద్రబాబు


ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: మైనారిటీలను మోసం చేసిన చంద్రబాబు అల్లా కాదని, సైతాన్‌తో సమానమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన ఏ  ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
అత్యంత పేదరికంలో ఉండే మైనారిటీ సోదరులను మరోసారి చంద్రబాబు నాలుగున్నరేళ్ల తరువాత మోసం చేయబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నారా హమారా..టీడీపీ హమారా అంటూ గుంటూరులో చంద్రబాబు మీటింగ్‌ పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ముస్లింలను అసలు పట్టించుకోలేదన్నారు. తన పాలనలో మైనారిటీలకు ఇంతవరకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదన్న సత్యం చంద్రబాబుకు ఇంతవరకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, మైనారిటీల ఓట్లు దండుకునేందుకు అబద్ధపు హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు మీ బడ్జెట్లో మైనారిటీలకు ఎంత కేటాయించారు, అందులో ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని ఆయన సూటీగా ప్రశ్నించారు. 2014–2015వ బడ్జెట్‌లో ముస్లింలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. 2015–2016వ సంవత్సరంలో రూ.726 కోట్లు కేటాయిస్తే ..ఇందులో రూ.215 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 2016–2017లో రూ.815 కోట్లు కేటాయిస్తే రూ.245 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 2017–2018వ సంవత్సరంలో రూ.1102 కోట్లు బడ్జెట్‌లో పెట్టి..రూ.250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. బడ్జెట్‌లో 27 శాతమే ఖర్చు చేసి, మిగతా నిధులు టీడీపీ ప్రచారానికి ఉపయోగించారన్నారు. ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. నీ బినామీలను ఎమ్మెల్సీని చేసి మంత్రులుగా కూర్చోబెట్టుకున్నావని, ముస్లింలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారన్నారు. ముస్లిం బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారని, ఉచిత విద్య అన్నారు..ఎక్కడ అమలు కాలేదన్నారు. మసీదులకు నిధులు ఇస్తామని ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చలేదన్నారు. 15 మందికి ఎమ్మెల్సే సీట్లు ఇస్తామని మోసం చేశారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. చంద్రబాబును అల్లాతో పోల్చడం బాధాకరమన్నారు. టీడీపీ నేత షరీఫ్‌ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. నరేంద్రమోడీ, వాజ్‌పేయితో సహవాసం చేసిన చంద్రబాబు ఈ రోజు బీజేపీతో శత్రుత్వం అని నాటకాలు ఆడుతున్నారన్నారు. బీజేపీతో సహవాసం చేసే టీడీపీని ప్రజలు నమ్మరన్నారు. మతతత్వ పార్టీతో కలిసి పని చేసే టీడీపీని నమ్మొద్దని ఆయన సూచించారు. 
 
Back to Top