రాజీనామాల‌కు సిద్ధ‌మా?- 48 గంట‌ల దీక్ష విర‌మించిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే
- స్టీల్ ప్లాంట్ కోసం ఎందాకైనా పోరాటం

  
 వైయ‌స్ఆర్ జిల్లా  : కడప ఉక్కు పరిశ్రమ కోసం వైయ‌స్ఆర్ జిల్లాకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల‌కు సిద్ధ‌మ‌ని, టీడీపీ నేత‌లు కూడా సిద్ధ‌మా అని ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి స‌వాల్ విసిరారు. ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి చేపట్టిన 48 గంటల నిరహార దీక్ష పూర్తైంది. గురువారం ప్రొద్దుటూరులో ఆయన దీక్షను విరమించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..
స్టీల్‌ ప్లాంట్‌ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దీక్షలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కేవలం ఓట్లు కోసమే టీడీపీ మొసలి కన్నీరు కార్చుతోందని ఆరోపించారు.
ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్యేలు, ఎ‍మ్మెల్సీలు రాజీనామాలు చేయడానికి సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. టీడీపీతో రాజీనామాలు చేయించే బాధ్యతను అఖిలపక్షం తీసుకోవాలన్నారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ రాకపోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని అన్నారు. 

Back to Top