బాబు మోసాలను ఎండగట్టేందుకే వంచన దినం

600ల హామీలిచ్చిన ప్రజలందరినీ వంచించాడు


గన్నవరం: ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి మోసం చేసిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖపట్నంలో ఈ నెల 30వ తేదీన వంచన దినం జరుపుతుందని పార్టీ కృష్ణా జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2014 ఏప్రిల్‌ 30వ తేదీన చంద్రబాబు, నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు, పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అంటూ పోటీపడి ప్రకటించి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు 600ల హామీలు ఇచ్చారని, వాటిలో ప్రధానంగా రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించాడన్నారు. అందుకే వంచన దినం జరుపుతున్నామన్నారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించాడన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం కావడం.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లీ హోదా అంటూ నాటకం ఆడుతున్నాడన్నారు. హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే వంచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 
 
Back to Top