నిధుల మంజూరుపై చర్చకు సిద్ధమా..?

దమ్ముంటే ట్విట్టర్‌నాయుడు సవాల్‌ స్వీకరించాలి
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా లోకేష్‌ వ్యాఖ్యలు
ప్రతిపక్ష ఎమ్మెల్యలమంతా కలిసినా చంద్రబాబు ఫండ్‌ ఇవ్వలేదు
నియంతలా వ్యవహరిస్తూ.. టీడీపీకి వందల కోట్లు ఇచ్చారు
నిధుల మంజూరుపై గతంలో వైయస్‌ జగన్‌ ప్రధానికి లేఖ రాశారు
సీఎం రిలీఫ్‌ఫండ్‌ మంజూరులో కూడా వివక్ష
హైదరాబాద్‌: ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధుల విడుదలపై రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు నారా లోకేష్‌నాయుడుకు సవాల్‌ విసిరారు. ట్విట్టర్‌లో పోస్టులు పెట్టడం కాదు.. దమ్ముంటూ చర్చకు రావాలన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల మంజూరుపై లోకేష్‌ చేసిన ట్వీట్‌ అర్థరహితమని ధ్వజమెత్తారు. లోకేష్‌కు నిజంగా బు్రర ఉంటే ఇలా మాట్లాడేవాడు కాదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కొరుముట్ల శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేజీలపై మాట్లాడి ప్రజలను ఆశ్చర్యపరిచే లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా అన్ని అసత్యాలు పోస్టు చేస్తున్నారన్నారు. లోకేష్‌కు ట్విట్టర్‌ నాయుడు అనే పేరుకు కూడా ఉందన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 36 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలం 2016 నవంబర్‌ 25న సీఎంను కలిసి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఇవ్వాలని గట్టిగా నిలదీశామన్నారు. అయినా చంద్రబాబు స్పందించకుండా.. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా అవి వేరే రూట్‌లో వస్తాయని దుర్మార్గంగా మాట్లాడారన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించారన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు రూ. 1.5 కోట్ల నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గాల ఫండ్‌ దొడ్డిదారిన పంపి నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.  

నారా లోకేష్‌నాయుడు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, రాష్ట్ర పరిస్థితులపై అవగాహన ఉందో.. లేదో..? అర్థం కావడం లేదని కొరుముట్ల శ్రీనివాసులు అనుమానం వ్యక్తం చేశారు. నిధులు ఇచ్చారని ట్విట్టర్‌ నాయుడు నమ్మితే.. నిరూపించాలని, రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కూడా చంద్రబాబు దొడ్డిదారిన పంపుతున్న దుస్థితి నెలకొందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు రిలీఫ్‌ఫండ్‌కు లెటర్‌ ఇస్తే వాటిని పక్కన పెడుతున్నారని, ప్రజలు తిరస్కరించిన వారికి ఫండ్‌ రిలీజ్‌ చేస్తున్నారన్నారు. లబ్ధిదారులకు చేరాల్సిన సహాయనిధిని టీడీపీ నేతలు పర్సంటేజ్‌లు పంచుకుంటున్నారన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ ఏమైనా మీ పార్టీ నుంచి ఇస్తున్నారా చంద్రబాబూ అని ప్రశ్నించారు. 

నియోజకవర్గాల స్పెషల్‌ డెవలప్‌ఫండ్‌పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దుర్మార్గంగా మాట్లాడాడని కొరుముట్ల గుర్తుచేశారు. 2016 మార్చిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఫండ్స్‌ ఇవ్వం...  ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ స్పెషల్‌ఫండ్‌ను ఒక అస్త్రంగా వాడుతున్నారు.. ఫండ్‌ ఇస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ టీడీపీలో చేరరు.. మీ అస్త్రం పనిచేయదని చెప్పారని గుర్తు చేశారు. 2016 నవంబర్‌ 30న నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశామన్నారు. ప్రభుత్వ నియంత పోకడపై వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి మార్చి 25న లేఖ రాశారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని, దీనిపై చొరవ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారని గుర్తు చేశారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వని చంద్రబాబు వందల జీవోలు విడుదల చేసి టీడీపీ నేతలకు వందల కోట్లు కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ధ్వజమెత్తారు. 

రోడ్డు ప్రమాదం జరిగి చావుబతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తిని 108లో ఆస్పత్రికి తరలించాలన్నా.. నీది టీడీపీనా..? వైయస్‌ఆర్‌ సీపీనా..? అని అడిగే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని కొరుముట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంపై ఎప్పుడో పోరాటం చేసేవారన్నారు. అమరావతిలో కూర్చొని సవాల్‌ విసురుతారు.. ఢిల్లీకి వెళ్లి మోడీతో కరచాలనం చేసి నవ్వుకుంటూ ముచ్చటిస్తున్నాడన్నారు. దీనిపై ఎల్లోమీడియాతో పోరాటయోధుడిలా ప్రచారం చేయించుకుంటున్నాడన్నారు. ఇప్పటికైనా నిజాలు నిర్భయంగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని లోకేష్‌ అలవర్చుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మంచిపద్ధతి కాదని సూచించారు. 
 
Back to Top