సోమిరెడ్డి అవినీతి మొత్తం బయటపెడతా

తిన్న సొమ్మంతా కక్కిస్తాం
వాస్తవాలు బయటపడుతున్నాయనే భయంతో సభ వాయిదా
నెల్లూరు: మంత్రి సోమిరెడ్డి అవినీతి మొత్తం బట్టబయలు చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. దోపిడీ మొత్తం బయటపడుతుందని జెడ్పీ సమావేశాన్ని మంత్రి వాయిదా వేసుకొని పారిపోయాడన్నారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జెడ్పీ సమావేశంలో ప్రతిపక్షాలు, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి సోమిరెడ్డి తప్పించుకొని పోయాడన్నారు. నీతివంతమైన పాలన చేసి ఉంటే.. చేయని పనులకు దొంగ బిల్లులు చేసుకొని డబ్బులు వసూలు చేసుకోవడంలో నీ పాత్ర లేకుంటే ఎందుకు వాయిదా వేయించావని మంత్రిని ప్రశ్నించారు. అధికారులు చెబుతున్న విషయాలకు అడ్డుతగులుతూ నానా రభస సృష్టించారన్నారు. చివరకు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ను సభ వాయిదా వేయాలని పలుమార్లు డిమాండ్‌ చేశాడన్నారు. వాస్తవాలు బయటపడుతున్నాయని భయంతోనే మంత్రి సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయాడన్నారు. జిల్లాకు చెందిన ప్రజల సొత్తును సోమిరెడ్డి, ఆయన తనయుడు విచ్చల విడిగా దోపిడీ చేసుకుంటూ సాయంత్రం అయితే వాటాలు పంచుకుంటున్నారన్నారు. ఎక్కడా ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి డబ్బు మొత్తం కక్కిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 
 
Back to Top