కిరణ్‌కు కాంగ్రెస్‌లో చేర్పించింది బాబే


గుంటూరు: వైయస్‌ఆర్‌సీపీని బలహీన పరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్పించింది చంద్రబాబే అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు, నరేంద్రమోడీ ఇద్దరూ కూడా ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేయడంతో ఈ కార్యక్రమాన్ని నయవంచనపై గర్జనగా నామకరణం చేశామన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చంద్రబాబు, నరేంద్రమోడీ హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి ముద్దాయి అయితే, చంద్రబాబు రెండో ముద్దాయి అన్నారు. నీతి అయోగ్‌ ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరచి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? ఈశాన్య రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి చెందాయా అని మాటమార్చారన్నారు. హోదాకు బదులు ప్యాకేజీ కావాలని  కోరడంతోనే కేంద్రం కూడా ఇవ్వలేదన్నారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ప్యాకేజీని స్వాగతించి, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారన్నారు. ప్రత్యేక హోదాను అందరూ కోరడంతో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. ఆయన యూటర్న్‌ తీసుకొని కాంగ్రెస్‌ వైపు వెళ్లేందుకు రైట్‌ టర్న్‌ తీసుకున్నారన్నారు. కర్నాటకలో సోనియా, రాహుల్‌ను కలిశారన్నారు. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లో చేర్పించింది చంద్రబాబే అన్నారు. వైయస్‌ఆర్‌సీపీని బలహీన పరిచేందుకు చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభ పీఏసీ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తీసుకుందని చెప్పారు. 

 
Back to Top