ఎవరు అడ్డుకున్నా బహిరంగ సభకు వెళ్తా

కోడెల అవినీతిని ప్రజల ముందు బహిర్గతం చేస్తా
వెన్నాదేవి గ్రామంలో 16 ఎకరాల కబ్జా
అంధుల పాఠశాల భూమిలోనూ టీడీపీ నేతల చేతివాటం
అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తా..
హౌస్‌ అరెస్టు చేసి అడ్డుకోవడం సిగ్గుచేటు
గుంటూరు: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభ ద్వారా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అవినీతిని బహిర్గతం చేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిని బయటపెట్టేందుకు ఎమ్మెల్యే గోపిరెడ్డి ఏర్పాటు చేసిన బహిరంగసభకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అనుమతి రద్దు చేసి.. ఆయన్ను హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు అడ్డుకున్నా.. సాయంత్రం ప్రజల ముందుకు వెళ్లి తీరుతానన్నారు. ఏఎల్‌సీ ఆస్తులకు సంబంధించిన అంధుల పాఠశాల భూమి లీజు విషయంలో వివాదం జరుగుతుందని, అందులో ఏడుగురు సభ్యులంటే కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే బయటపెట్టారని, మిగిలిన వారంతా టీడీపీ నేతలేనన్నారు. ల్యాండ్‌ విషయంలో ఎమ్మెల్యేకి సంబంధం ఉందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిపై ఎలాంటి మచ్చలేదు.. ఆరోపణలు లేవు.. ఏదోరకంగా బురదజల్లాలని స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

కోడెల శివప్రసాద్, ఆయన అనుచరులు చేస్తున్న అవినీతిని ఆధారాలతో బయటపెట్టేందుకు బహిరంగ సభ ఏర్పాటు చేసి మూడ్రోజుల క్రితం పర్మీషన్‌ కోరితే.. నిన్న రాత్రి సీఐ వచ్చి అనుమతి ఇవ్వడం లేదంటూ వచ్చి సంతకాలు పెట్టించుకొని హౌస్‌ అరెస్టు చేశారని మండిపడ్డారు. అదే విధంగా గ్రామాల్లోనే వైయస్‌ఆర్‌ సీపీ నేతలను ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారని ధ్వజమెత్తారు. వాస్తవాలను పోలీసుల చేత అణిచివేయాలని కోడెల శివప్రసాద్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వెన్నాదేవి అనే గ్రామంలో సర్వే నంబర్‌ 167, 168లో 16 ఎకరాల భూమిని కోడెల శివప్రసాద్‌ కబ్జా చేశారన్నారు. అదే విధంగా అక్కడి ఏడు ఇళ్లను నాశనం చేశారన్నారు. అదే విధంగా నర్సరావుపేటలో ఎస్‌ఎస్‌ఎం కళాశాల అధ్యాపకుడు శ్రీహరికి సంబంధించిన రూ. కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారని, బాధితుడు కోర్టుకు వెళ్లి భూమి సాధించుకున్నా.. ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా గుంటూరు జిల్లా నల్లపాడు దగ్గర సాంబిరెడ్డి అనే వ్యక్తి వద్ద రెండున్నర ఎకరాలను లాక్కొని అతని కుటుంబాన్ని రోడ్డున పడేశారన్నారు. నర్సరావుపేట చుట్టూ మట్టి అమ్ముకోవడం.. ఒక్కో చెరువును కోట్లకు రైల్వే కాంట్రాక్టర్‌కు అమ్ముకుంటున్నారన్నారు. కోడెల శివరామకృష్ణ క్రషర్‌ పెట్టి అక్రమంగా రోజుకు 150 ట్రిప్పుల మట్టి, కంకరను అమ్ముకుంటున్నాడన్నారు. ఇవన్నీ ప్రజల ముందు పెడితే.. ఎవరి బాగోతం ఏంటో వారికే తెలుస్తుందన్నారు. 
Back to Top