టీడీపీ దోపిడీకి అడ్డూ అదుపు లేదు


– రాయల్టీ కట్టకుండానే మట్టిని దోచుకునేందుకు జీవోలు
– చెరువుల తవ్వకాల్లో నిబంధనలు పాటించడం లేదు
– చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు
– బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌లు ఎప్పటికీ వైయస్‌ఆర్‌సీపీకి శత్రువులే
హైదరాబాద్‌: రాష్ట్రంలో మట్టి, ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని, వారి దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాయల్టీ కట్టకుండానే మట్టిని తవ్వుకోవచ్చు అని జీవోలు విడుదల చేయడం దుర్మార్గమన్నారు. చెరువుల తవ్వకాల్లో నిబంధనలు పాటించడం లేదని ఆయన విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్రం కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

టీడీపీ నేతలు భరితెగించారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. మళ్లీ అధికారంలోకి రామని గ్రహించి జీవోలు ఇచ్చి మరీ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజల బాగోగులు టీడీపీ నేతలకు పట్టడం లేదని, దోచుకోవడానికి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. గతంలో జీవో 23 ఉండేదన్నారు. దీని ప్రకారం వాణిజ్య అవసరాలకు మాత్రమే వాడుకోండని చెప్పారన్నారు. ఇప్పుడు దోచుకోండి అన్నట్లుగా జీవోను విడుదల చేశారన్నారు. టీడీపీ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయానికి ఓ భరోసా ఉండేదన్నారు. చంద్రబాబు వచ్చాక చెరువుల్లోని మట్టిని ఇష్టరాజ్యంగా తవ్వుకొని అమ్ముకుంటున్నారన్నారు. 30 అడుగుల వైనే చెరువుల్లో తవ్వకాలు చేపడుతున్నారన్నారు. ఇలా తవ్వడం వల్ల పంటలకు నీరు అందడం లేదన్నారు. చెరువులు తవ్వి మరీ రోడ్డు వేస్తున్నారని విమర్శించారు. పర్యావరణ, మైనింగ్‌ చట్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మట్టిని అమ్ముకొని వ్యాపారం చేసుకోవడమే టీడీపీ ధ్యేయమన్నారు. ఈ రకంగా జీవోలు విడుదల చేయడం వల్ల వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. 

నీరు–చెట్టు పథకం పేరుతో ఉపాధి నిధులను మళ్లీంచి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. నాలుగేళ్లుగా టీడీపీ నేతలు చేస్తున్న మట్టి, ఇసుక దోపిడీతో వేల కోట్ల ప్రజాధనం స్వాహా చేశారన్నారు. రాయల్టీ కట్టకుండా మట్టిని దోచుకునేందుకు జీవోలు విడుదల చేయడం దుర్మార్గమన్నారు. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఖజానాను దోచుకోండి అని జీవోలు ఇచ్చింది ఒక్క చంద్రబాబు ఒక్కరే అన్నారు. నారా ఔరంగజేబు ఇష్టారాజ్యంగా జీవోలు ఇచ్చి తమ్ముళ్లకు దోచి పెడుతున్నారన్నారు. ఈ నాలుగేళ్లలో చెరువుల్లోని మట్టి, పూడికను 80 కోట్ల క్యూబిక్‌మీటర్ల తవ్వి దోచుకున్నారని విమర్శించారు. క్యూబిక్‌ మీటర్‌ రూ.500 చొప్పున దాదాపుగా రూ.30 వేల కోట్లు తెలుగు తమ్ముళ్లు మట్టి, ఇసుక రూపంలో దోచుకున్నారన్నారు. అమరావతిలో భూములు దోచుకోవడమే కాకుండా మట్టి, ఇసుకను వదలిపెట్టడం లేదన్నారు. మహిళలకు, బాలికలకు రాష్ట్రంలో రక్షణలేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. ఇటీవల చంద్రబాబు 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరు ఏమి సాధించినా ఆ ప్రగతి నాదే అంటున్న చంద్రబాబు..70 ఏళ్లుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నానని ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో టీడీపీ ఉంటుందని చెబుతున్నారని, చంద్రబాబు వ్యాఖ్యలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబు కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలని కోరారు. 
చంద్రబాబు కేంద్రంపై యుద్ధమంటున్నారని, ఆయన పోరాటంలో చిత్తశుద్ది లేదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి పని చేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నో నిధులు తీసుకువచ్చే వారన్నారు. అయితే చంద్రబాబు తన వ్యక్తిగత స్వలాభాలకు రాజీ పడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని గ్రహించి ధర్మపోరాటం చేయడం దారుణమన్నారు. ప్రజల ఆలోచనలను కన్‌ప్యూజ్‌ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఈ రోజుకు బీజేపీతో పక్కా లాలూచీ రాజకీయాలు చేస్తూ..పదే పదే వైయస్‌ఆర్‌సీపీపై నిందలు వ్తేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ ఈ మూడు పార్టీలు మాకు శత్రువులే అని వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితమంతా పొత్తులమయమని ఫైర్‌ అయ్యారు.
 

తాజా ఫోటోలు

Back to Top