చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి అరెస్టు

ఏపీ అసెంబ్లీ: రవాణాశాఖ అధికారిపై దాడి చేసిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ ఎదుట దీక్ష చేప‌ట్టిన  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా... నల్లరంగు దుస్తులు ధరించి ఆయన దీక్ష చేపట్టారు. అయితే ఆయ‌న్ను అక్క‌డి నుంచి బ‌లవంతంగా త‌ర‌లించారు .అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఇలాంటి నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేయ‌కూడ‌దంటూ మార్స‌ల్స్ ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డి అరెస్టును ఖండిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. అధికారుల‌పై దాడుల‌ను ప్ర‌జాస్వామ్య‌వాదులు ఖండించాల‌ని ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు కోరారు. చెవిరెడ్డిని లాక్కెళ్ల‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో గేట్ నంబ‌ర్ 4 వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొన‌గా,  పోలీసులు చెవిరెడ్డిని మంగ‌ళ‌గిరికి త‌ర‌లించారు. అంత‌కు ముందు చెవిరెడ్డి మాట్లాడుతూ..తిరుపతి విమానాశ్రయంలో జరిగిన ఓ చిన్న ఘటన నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి,  శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జ్ మధుసూదన్ రెడ్డి సహా తనపైన తప్పుడు కేసు పెట్టి 21 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారని చెవిరెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జైల్లో ఉండగానే, మరికొన్ని కేసులు బనాయించి పీలేరు, రాజమండ్రికి తరలించారని విమర్శించారు. ఐజీ స్థాయి అధికారిపై టీడీపీ నేతలు దుర్భాషలాడినా కేసులు నమోదు చేయలేదని మండిపడ్డారు. మధ్యవర్తిత్వం పేరుతో నాటకాలాడి కేసు నమోదు కాకుండా చేశారని అన్నారు. రాష్ట్రంలో తాలిబన్ల తరహా పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

Back to Top