పట్టాలు ఇచ్చేవరకు కదిలే ప్రసక్తే లేదు

ఇంకా ఎన్నాళ్లీలా పేదలను వేధిస్తారు
శెట్టిపల్లిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిరసన దీక్ష
చిత్తూరు: ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్‌ మండలం శెట్టిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.. శెట్టిపల్లి గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకొని ఏళ్లు గడుస్తున్నా.. పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. పట్టాలు వచ్చినా ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారులు స్పందించే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. ఎన్ని రోజులైనా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. ప్రభుత్వం స్థలాలు ఇస్తే పేదలు అప్పులు చేసి, బంగారం తాకట్టుపెట్టి ఇళ్లు కట్టుకున్నారని, చివరకు ఆ ఇంటిపై వారికి హక్కు లేకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. ఇంటి పట్టాలు బాధితులకు చేరే వరకు శెట్టిపల్లి గ్రామం నుంచి కదిలే ప్రసక్తే లేదన్నారు. ప్రజలంతా ఒకవైపు, అధికార పార్టీ, అధికారులు మరోవైపు ఉండి ఇంకా ఎన్నాళ్లు వేధిస్తారో చూస్తామన్నారు. బాదితులతో కలిసి రోజు రోజుకు పోరాటం ఉధృతం చేస్తానన్నారు. 
 
Back to Top