డయాఫ్రమ్‌ వాల్‌ను ఎవరైనా జాతికి అంకితం చేస్తారా


 

విజయవాడ: పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ను ఎవరైనా జాతికి అంకితం చేస్తారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేవారు. అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. పోలవరంకు సంబంధించిన క్లియరెన్స్‌ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయ్యాయని చెప్పారు. 2014 నుంచి 2016 వరకు చంద్రబాబు ఎందుకు పోలవరం ఊసెత్తలేదని ఆయన నిలదీశారు. పట్టిసీమ కంటే ముందు పోలవరాన్ని ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రజా ఉద్యమంలా మారిందని  తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అపనమ్మకం, వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంపై ఉన్న ప్రజాదరణే ఈ స్పందనకు కారణమన్నారు.  ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు అధికారమిస్తే.. చంద్రబాబు ప్రతి సోమవారం సూపరిండెంట్‌లా పోలవరం వెళ్లడం హ్యాస్యాస్పదమన్నారు. ఒక ఇంజనీర్‌ చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయడమేంటన్నారు. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే రహస్య ఒప్పందాలు చేసుకున్నారని, సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలనడం పచ్చి అబద్ధమని విమర్శించారు. కేవలం ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని, సారవంతమైన భూములను సింగపూర్‌కు సర్వహక్కులు రాసిచ్చే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది అని నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో చంద్రబాబు స్పెషలిస్ట్‌ ఆరోపించారు.


Back to Top