టీడీపీ నేతలూ.. ఆరోగ్యాలు జాగ్రత్త

ఇద్దరు వ్యక్తులు భోజనానికి వెళ్తే ఇంత కథ సృష్టిస్తారా?
ఆకుల సత్యనారాయణ కలిస్తే తప్పేముంది
ఆంధ్రభవన్‌లో టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్‌ను కలిశాను.. అది చూపించరే..
మహిళలతో, చేతుల్లో డ్రింక్స్‌ పట్టుకున్న ఫొటోలకు సమాధానం ఏంటీ?
చంద్రబాబులా అర్ధరాత్రి చిదంబరం, గడ్కరినీ కలిసే అలవాటు లేదు
మూర్ఖుల మనసు రంజింపరాదని లోకేష్‌నాయుడు ట్వీట్‌తో అర్థమైంది
అమెరికా యూనివర్సిటీపై అనుమానం వ్యక్తం అవుతోంది
భోజనానికి వెళ్తే ఇంత తతంగం సృష్టిస్తారా?

హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి భోజనానికి వెళ్తేనే టీడీపీ ఎందుకు ఇంత ఉలిక్కిపడుతుందో.. భయపడుతుందో అర్థం కావడం లేదని పీఏసీ చైర్మన్, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖామంత్రి నారా లోకేష్‌ నాయుడు ట్వీట్‌ ఆశ్చర్యంగా ఉందని బుగ్గన అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి ఢిల్లీలో బీజేపీ బాస్‌లను సీక్రెట్‌గా కలిశారని ట్వీట్‌ చేశారన్నారు. వెంటనే ఆర్థికమంత్రి యనమలను రంగంలోకి దించి పీఏసీ చైర్మన్‌ ఏదో డాక్యుమెంట్స్‌ అందజేశారని.. ప్రివిలేజ్‌ కదా.. రాజ్యాంగ బద్ధమైన కమిటీ కదా అని మాట్లాడిస్తున్నారన్నారు. ఏం జరిగిందని ఇంత భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుగ్గన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ వైఖరిని చూసిన తరువాత ఒక పద్యం గుర్తుకు వస్తుందన్నారు. తివిరి ఇసుము నుంచి తైలంబు తీయవచ్చు.. దవలి మృగత్రుష్టి నుంచి నీరుతాగవచ్చు.. కోరి కుందేలు కొమ్ము సాధించవచ్చు.. చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అనే పద్యం కరెక్ట్‌గా సూటవుతుందన్నారు. 

చంద్రబాబు మాదిరిగా అర్ధరాత్రి వెళ్లి చిదంబరం, గడ్కరీని కలిసే కర్మ వైయసార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టలేదని, పార్టీకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్‌ ఉన్నాయన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌లు తలెత్తుకొని జీవించడం నేర్పించారన్నారు. ఆకుల సత్యనారాయణకు ఢిల్లీకి వెళ్లి ఏదో డాక్యుమెంట్స్‌ అందజేశానని మాట్లాడుతున్నారని, టీడీపీ వ్యాఖ్యలో వాస్తవం లేదన్నారు. ఒకవేళ ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఢిల్లీకి వెళ్లి అందజేయాలా.. విజయవాడలో ఇవ్వలేనా..? అని ప్రశ్నించారు. ఆకుల సత్యనారాయణ తనకు పర్సనల్‌గా మంచి స్నేహితుడని.. ఆంధ్రభవన్‌కు వెళ్తే అక్కడ ఆయన కలిశారని, ఇద్దరం కలిసి మధ్యాహ్నం పక్కనే ఉన్న షాంగ్రిల్లా హోటల్‌కు వెళ్లామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కూడా తనకు కాలేజీ మిత్రుడని, అదే ఆంధ్రభవన్‌లో రవికుమార్‌ తనను ఆలింగనం చేసుకున్నాడని.. అది ఎందుకు చూపించడం లేదని నిలదీశారు. భోజనానికి వెళ్తేనే ఇంత ఉలిక్కిపడుతున్నారంటే.. నిజంగానే కలిస్తే టీడీపీ నేతల ఆరోగ్యాలు ఏమైపోతాయోనని ఆశ్చర్యంగా ఉందన్నారు. 

కూన రవికుమార్‌తో మాట్లాడాను.. అంటే ఆయన వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నాట్లా అని బుగ్గన నారా లోకేష్‌నాయుడును ప్రశ్నించారు. బీజేపీని టీడీపీ విభేదించినప్పుడు టీటీడీలో మహారాష్ట్ర ఆర్థికమంత్రి భార్యను ఎందుకు మెంబర్‌గా పెట్టారని నిలదీశారు. అంటే బీజేపీని టీడీపీ సొంతం చేసుకున్నట్లుగా అభిప్రాయపడుతుందని.. అందుకే ఎవరూ బీజేపీ నేతలతో మాట్లాడినా ఉలిక్కిపడుతుందన్నారు. లోకేష్‌నాయుడు ట్వీట్‌ చేస్తుంటే ఆకాశం విరిగి మీదపడుతుందని పరిగెత్తిన కుందేలు, జింక, గుంతనక్క కథ గుర్తుకు వస్తుందన్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకోవడం తప్పు అయితే.. లోకేష్‌నాయుడు గురించి సోషల్‌ మీడియాలో చాలా ఫొటోలు వచ్చాయని.. మహిళలతో కలిసి.. డ్రింక్‌ చేతిలో పట్టుకొని ఉన్న ఫొటోలకు ఏం సమాధానం చెబుతారన్నారు. 


లోకేష్‌ నాయుడు ఎందుకు ఇంత అమాయకంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రపంచంలో ఎవరూ ఏ ఫీల్డ్‌లో విజయం సాధించినా అందరికీ నేనే స్ఫూర్తి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మీ తండ్రి మీకు సరిగ్గా నేర్పించలేదా.. మీరు నేర్చుకోలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. అమెరికాలో చదువుకున్నానని చెప్పుకున్నారని విన్నానని, ఈ సంఘటన చూసిన తరువాత అమెరికా యూనివర్సిటీపైనే సందేహం కలుగుతుందన్నారు. మెట్ల మీద ఇద్దరు కలిస్తే దానిపై ఇంత కథ అల్లి యనమలను రంగంలోకి దింపి ఆయన ఏదో పీఏసీ, ప్రివిలేజ్‌ మోషన్‌ అని పార్టీ అంతా కదులుతున్నారంటే అమాయకత్వమా.. లేక భయమా..? అని నిలదీశారు. అసెంబ్లీలో లోకేష్‌నాయుడు ఎన్నోసార్లు మా నాన్నారికి, మా తాతగారికి చెడ్డపేరు తీసుకురానని చెప్పారు.. ఎవరైనా మంచిపేరు తెస్తానని చెబుతారు కానీ.. చెడ్డపేరు తేనని చెబుతారా.. ఇది ఎక్కడైనా చూశారా..? అని విరుచుకుపడ్డారు. 

లోకేష్‌ మైక్‌ ముందుకు వస్తే మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ టీడీపీ అని.. టీడీపీకి ఓట్లు వేస్తే ఉరివేసుకున్నట్లేనని మాట్లాడుతారని ట్వీట్‌లకే పరిమితం చేశారనే అనుమానం వ్యక్తం అవుతుందని బుగ్గన అన్నారు. ఇంత అమాయకత్వంలో టీడీపీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ పరిస్థితి ఏంటని అందరూ భయపడుతున్నారన్నారు. ఒక వ్యక్తి చనిపోయే పరిస్థితుల్లో ఒక్క గ్లాస్‌ మంచినీళ్లు ఇవ్వమంటే.. మీది తెలుగుదేశమా.. కదా అని అడిగే మనస్తత్వంలో ఉన్నారన్నారు. ఒక మనిషి ఇంకో మనిషితో కలవకూడదా.. ఇదేమైనా చట్టమా..అని ప్రశ్నించారు. చట్టాన్ని ఎవరైనా పాటిస్తున్నారా..? 23మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులను చేశారు.. ఇది రాజ్యాంగ పరమా..? అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లుగా నడుపుతారు.. రాజధాని నిర్మాణానికి ఒక్క రాజకీయ పార్టీనైనా సంప్రదించారా..? అది రాజ్యాంగ పరమా..? చట్టాన్ని తూట్లు పొడిచేవారు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి భోజనం చేసిన సంఘటనకు ఇంత కథ నడపడం చూస్తుంటే టీడీపీకి మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌ అని అర్థం అవుతుందన్నారు. 
 
Back to Top