అన్నీ తప్పుడు లెక్కలే


– ఏపీ బడ్జెట్‌లో లెక్కలు వాస్తవ దూరంæ
– ఇష్టం వచ్చినట్లు అంకెలు మార్చుతున్నారు
– రెవెన్యూ లోటుపై స్పష్టత లేదు
– రెవెన్యూ రాబడి ఎక్కువగా చూపుతున్నారు
– రూ. 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి పెట్టారు
–ప్రభుత్వ ఆడంబరాలతో ఏపీకి నష్టం
హైదరాబాద్‌: ఏపీ బడ్జెట్‌లో లెక్కలన్నీ అవాస్తవాలే అనిlవైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గతంలో మాదిరిగానే బడ్జెట్‌లో గొప్పలు చెప్పారు తప్ప, లెక్కలు వాస్తవ దూరం అన్నారు. చంద్రబాబు ఆడంబరాలకు పోవడంతో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని, నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. బడ్జెట్‌ ప్రసంగంపై బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే ఏపీ 2022వ సంవత్సరం కల్లా దేశంలో టాప్‌ 3వ స్థానంలో ఉంటుందని, 2029లో దేశంలోనే ఉన్నత స్థానంలో ఉంటుందని, 2050కి ప్రపంచంలోనే ఏపీ ఉన్నతంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతుందన్నారు. ఇదే అబద్ధాలు మొన్న గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించారని విమర్శించారు.  రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు చెబుతూనే..బ్రహ్మండంగా స్థూల ఉత్పత్తి ఉందని పేర్కొనడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్రానికి సీఐఐ సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయని చెబుతున్నారని విమర్శించారు. క్యానర్‌ కేర్‌ ఆసుపత్రిలోనే 12 వేల ఉద్యోగాలట అని ఎద్దేవా చేశారు.


రెవెన్యూ లోటు ఎందుకు తీరడం లేదు?
రాష్ట్రంలో  బ్రహ్మండంగా ఆదాయం ఉంటే ఎందుకు రెవెన్యూ లోటు తీరడం లేదని బుగ్గన ప్రశ్నించారు.  2015–2016లో రూ.7300 కోట్లు, 2016లో రూ.2220 కోట్లు, 2017–2018లో రూ.4018 కోట్లు లోటు ఉందని చెప్పారన్నారు. ఈ లెక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన సొంత పన్ను రూ.65353 కోట్లు అన్నారు. గతేడాది రూ.50300 కోట్లు ఉండేదన్నారు. రెవెన్యూ రాబడి ఎక్కువగా చూపుతున్నారని తప్పుపట్టారు. రెవెన్యూ లోటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు.  కేంద్రాన్ని ప్రశ్నించే బదులు వారికే సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. అనవసరంగా రూ.9 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకున్నారు తప్ప..అక్కడ చేసింది ఏమీ లేదన్నారు. వేల ఎకరాల పంట పొలాలను తీసుకుని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానికి రూ.7 వేల కోట్లు కేటాయించామని చెబుతున్నారన్నారు. 

రాజధాని వేరు..నగర నిర్మాణం వేరు
రాజధాని నిర్మాణం వేరు..నగరం కట్టడం వేరని రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు. స్వీస్‌ చాలెంజ్‌ అన్నది ముడుపులతో కూడినదని విదేశీయులకు కూడా అర్థమైందన్నారు. చిన్న మిషన్‌ కావాలన్నా కూడా బ్యాంకులు ప్రాజెక్టు రిపోర్టు అడుగుతారన్నారు. నాలుగేళ్లుగా డీపీఆర్‌ లేదని, ఇంతవరకు రాజధాని డిజైన్‌ కూడా ఫైనలైజ్‌ కాలేదన్నారు. అప్పుడు కేంద్రం మనకు ఎంత ఇవ్వాలి, మన వద్ద ఎంత ఉందన్నది లెక్కలు వేసుకోవాలన్నారు. సింగపూర్, మలేసియా, లండన్‌ వంటి దేశాలు తిరిగి వచ్చిన చంద్రబాబు సాధించింది ఏమీ లేదన్నారు. నది ఒడ్డున ఎలాంటి నిర్మాణాలు కట్టకూడదని నిబంధనలు ఉన్నా చంద్రబాబు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్ర అప్పులు విఫరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. రూ.2 లక్షల కోట్లకు పైగా ఇప్పటికే అప్పులు చేశారన్నారు. వడ్డీభారం రూ,15 వేల కోట్లకు చేరిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడంబరాలు అవసరమా అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, విద్యా, వైద్యానికి నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. పరిశ్రమలు రావాలంటే కనెక్టివిటి ఉండాలని చెప్పారు. అయితే ఈ బడ్జెట్లో రోడ్లకు నిధులు లేవన్నారు. రైతు రుణమాఫీ హామీని చంద్రబాబు విస్మరించారన్నారు. లెక్కప్రకారం రూ.87 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా, చంద్రబాబు రూ.24 వేల కోట్లకు కుదించారన్నారు. ఈ రోజు రుణమాఫీకి కేటాయించింది రూ.17 వేల కోట్లు మాత్రమే ఇంతవరకు పూర్తి చేశారన్నారు. మిమ్మల్ని నమ్మిన రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంతో అయోమయంలో ఉన్నారన్నారు. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందన్నారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయలేదన్నారు. ఏకైక ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర బడ్జెట్‌ను స్టడీ చేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేస్తామని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 
 
Back to Top