ప్రత్యేక హోదా లేదు..ప్యాకేజీ రాలేదు


– నాలుగేళ్లలో టీడీపీ ఏం సాధించిందో
– ప్రత్యేక హోదా విషయంలో బాబు ఎన్నో మాటలు మార్చారు
– గతేడాది బడ్జెట్‌ ప్రసంగమే ఈ ఏడాది చదివించారు
– 2029లో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌ అంటున్నారు
– హాఠాత్తుగా ఫర్‌ క్యాపిటల్‌  ఇన్‌కం తగ్గిందని ప్రకటనలు
– విభజన హామీలు సరిగా నెరవేరలేదని గవర్నర్‌తో చెప్పించారు
– అయినా ప్రభుత్వం ముందుకుపోతుందట
– నాలుగేళ్లుగా ప్రజలను ఎందుకింత అయోమయం చేస్తున్నారు

హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికలకు ముందుకు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు సీఎం కాగానే ఆ హామీని విస్మరించారని, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించి హోదాకు తూట్లు పొడిచారని మండిపడ్డారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని, ప్యాకేజీ అసలే రాలేదని బుగ్గన విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రజలను ఎందుకింత అయోమయం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంలోని అంశాలు, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నాటకాలను బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎండగట్టారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రభుత్వం ఏం సాధించారో ఈ బడ్జెట్లో వివరించలేదన్నారు. 2017లోని బడ్జెట్‌కు ఇప్పటికీ కొన్ని తేడాలు కనిపిస్తున్నాయని చెప్పారు. విభజన అంశాల్లో ఇబ్బందులు ఉన్నా క్లారిటీతో ముందుకు వెళ్తున్నామని గవర్నర్‌తో చెప్పించారన్నారు.  2029 కల్లా దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌గా ఉంటుందని టీడీపీ ప్రబుత్వం గర్వంగా చెప్పుకుందన్నారు.  రాష్ట్ర  స్థూల ఉత్పత్తి చాలా బాగుందని చెప్పుకున్నారన్నారు. కేంద్రం పోలవరానికి అందిస్తున్న ఆర్థిక నిధులపై టీడీపీ సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. సీఐఐ సమ్మిట్‌లో రూ. 4 లక్షల కోట్లు, గతేడాది రూ.10 లక్షల కోట్లకు ఎంవోయులు కుదుర్చుకున్నట్లు చెప్పారన్నారు. నీరు–చెట్టు, మీ ఇంటికి మీ భూమి, దోమలపై దండయాత్ర చేసి దోమలను నిర్మూలించామని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పారని వివరించారు.


ఎన్‌టీఆర్‌ మాదిరిగానే ప్రత్యేక హోదా..
ఎన్‌టీ రామారావు బతికి ఉన్నప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదని, అలాగే ఈ నాలుగేళ్లు ప్రత్యేక హోదా గురించి రకరకాలుగా మాట్లాడి, మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని ప్రత్యేక హోదా కావాలని డ్రామాలాడుతున్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.  కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, దానికి బదులుగా ప్యాకేజీ సాధించామని గత ఏడాది ప్రసంగంలో గవర్నర్‌ చెప్పించారన్నారు. ఈ సారి మాత్రం ఏపీకి సరిగా నిధులు రాలేదని, హఠాత్తుగా ఫర్‌ క్యాపిట ఇన్‌కం తక్కువగా ఉందని చెప్పించారన్నారు. విజన్‌ కానీ, లీడర్‌ షిప్‌ విషయంలో రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పించారన్నారు. నిన్న ఢిల్లీలో అమిత్‌షాను కలవాలని వెల్లిన టీడీపీ నేతలు ఆర్థిక మంత్రిని కలిశారని చెప్పారు. రూ.16 వేల లోటు బడ్జెట్‌ను పూరించాలని కేంద్రానికి కోరినట్లు నిన్న చెప్పారన్నారు. ఇవాళ టీడీపీ ఎంపీల హడావిడి చూస్తే ఆశ్చర్యమనిపిస్తుందన్నారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎన్ని రకాలుగా చెప్పుకొచ్చారో చూశామన్నారు. ఎన్‌టీఆర్‌ బతికి ఉన్నంత వరకు చంద్రబాబు ఆయనను పట్టించుకోలేదు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్‌టీఆర్‌ను పొగుడుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారని చెప్పారు. 

వైయస్‌ జగన్‌ చెబుతున్నది టీడీపీ ఒప్పుకున్నట్లే..
నాలుగేళ్ల టీడీపీ పాలనలో అంత గందరగోళమే అని బుగ్గన విమర్శించారు.  ప్రత్యేక హోదా ఇవ్వరని టీడీపీ నేతలే చెప్పారని, ప్రత్యేక ప్యాకేజీ సాధించుకున్నామని చెప్పారు. ఈ రోజు మళ్లీ కొత్తగా చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చారన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొదటి నుంచి ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నారని గుర్తు చేశారు. మేం ఆ రోజు ప్యాకేజీతో ఎలాంటి ఫలితం లేదని చెబితే నాడు అవహేళనగా మాట్లాడిన టీడీపీ నేతలు  అదే పల్లవి అందుకున్నారన్నారు. ఈ రోజు ప్రత్యేక హోదా కావాలని టీడీపీ నేతలే అంటున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు మొట్ట మొదటి నుంచి చెబుతున్నది ఈ రోజు టీడీపీ ఒప్పుకుంటుందన్నారు. రాష్ట్ర అశాస్తీ్రయంగా, అన్యాయంగా, హేతుబద్ధంగా జరిగిందని ఇప్పుడు చెబుతున్నారని తప్పుపట్టారు. నాడు రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారని గుర్తు చేశారన్నారు. నాడు సుశీల్‌కుమార్‌షిండేకు లేఖ రాసినప్పుడు హేతుబద్ధత విషయం చెప్పాల్సిందని సూచించారు. 7 సెప్టెంబర్, 2016న అర్థరాత్రి ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించారన్నారు. అందులో ఏముందంటే కేవలం ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఏమైతే ఉన్నాయే వాటినే అందులో పొందుపరిచారన్నారు. నాడు పచ్చ పూలతో పండుగ చేసుకున్నారని మండిపడ్డారు. ఈ రోజు ప్రత్యేక హోదా రాలేదు..ప్యాకేజీ రాలేదన్నారు. నాలుగేళ్లుగా టీడీపీ సాధించిన ఘనకార్యం ఏమీ లేదన్నారు. 15 శాతం ఇన్‌సెంటీవ్‌ మాత్రమే సాధించారని, ఈ ఇన్‌సెంటీవ్‌ పశ్చిమబెంగాల్‌కు కూడా వచ్చిందన్నారు. జీఎస్‌టీ చట్టం వచ్చినప్పుడు కూడా మేం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తే ఒప్పుకోలేదన్నారు.  కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యకరమన్నారు. వాజ్‌పేయి హయాంలో ఉత్తరాంచల్‌కు ప్రత్యేక హోదా ప్రకటించారన్నారు. నూటికి నూరు శాతం ఇన్‌కం ట్యాక్‌ మినహాయింపు, కంపెనీలకు 30 శాతం రాయితీలు ఉంటాయన్నారు. ఈ విషయాలపై టీడీపీ నేతలు ఈ రాయితీలు లేవన్నట్లు ప్రచారం చేసి..మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నారని వివరించారు. 
 
Back to Top