అవిశ్వాసంతో బాబు బండారం బట్టబయలు

పార్లమెంట్‌ సాక్షిగా వెన్నుపోటు బహిర్గతం
రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యలతో లాలూచీ రాజకీయాలు వెలుగులోకి
వైయస్‌ జగన్‌తోనే హోదా సాధ్యమని ప్రజలందరికీ తెలుసు
24న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేస్తాం
నెల్లూరు: అవిశ్వాస తీర్మానంతో చంద్రబాబు బండారం బట్టబయలైందని, రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి ఆంధ్రరాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు పార్లమెంట్‌ సాక్షిగా బయటపడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ పోరాటంతో వెన్నులో వణుకుపుట్టిన టీడీపీ ప్రతిపక్షనేతను అభివృద్ధి నిరోధకుడని ఆరోపణలు చేశారని, కానీ నిన్న లోక్‌సభలో వైయస్‌ జగన్‌ నాలుగేళ్లుగా మాట్లాడిన మాటలే మాట్లాడారన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అంగీకారంతోనే ఇచ్చామని ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారన్నారు. 

ఒక వైపు బీజేపీని తిడుతూనే.. మరోవైపు చంద్రబాబు కేంద్రంతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. లోక్‌సభలో రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టంగా చెప్పారన్నారు. చంద్రబాబుతో మా బంధం విడిపోయేది కాదని చెప్పారన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి స్పష్టంగా బయటపడిందన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టేందుకు నిన్న గల్లా జయదేవ్‌తో మాట్లాడించారన్నారు. అసెంబ్లీ సాక్షిగా హోదా కంటే ప్యాకేజీ మేలని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. బండారం అంతా బయటపడిన తరువాత ఢిల్లీకి వెళ్లి అందరినీ కలుస్తానని చంద్రబాబు బయల్దేరారన్నారు. 

వైయస్‌ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యమని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు బలిచేయడానికి పూనుకున్నాడని, అవిశ్వాసంతో బండారం మొత్తం బయటపడిందన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నాడన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చెప్పినట్లుగా 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటే కేంద్రం ఎందుకు దిగిరాదో తేల్చుకుందామన్నారని, దానికి టీడీపీ సిద్ధపడాలన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు వ్యతిరేకంగా 24వ తేదీన వైయస్‌ జగన్‌ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారని, దాన్ని జయప్రదం చేసి ప్రజాగ్రహాన్ని వ్యక్తపరుస్తామన్నారు. 

తాజా వీడియోలు

Back to Top