వైయస్సార్సీపీ నేతల అరెస్ట్

అనంతపురం: ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాగునీటి కోసం ఆందోళనకు దిగిన ఉవరకొండ వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉరవకొండ సాగునీటి పథకాన్ని తక్షణమే ప్రారంభించాలన్న డిమాండ్‌తో వైయస్సార్సీపీ అనంతపురం ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం, అధికారులు హామీయిచ్చే వరకు ఆందోళన కొనసాగించేందుకు సిద్ధపడ్డారు.

వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వైయస్సార్‌ సీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ప్రాంగణం హోరెత్తింది. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనను చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని వైయస్సార్‌ సీపీ నాయకులు మండిపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యీ పయ్యావుల కేశవ్‌ నియోజకవర్గ రైతులకు నీరు రానివ్వకుండా కుట్రలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకి అని విమర్శించారు. సాగునీటిని అడ్డుకుంటున్న పయ్యావులకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top