కమీషన్ల కోసమే సోమవారం.. పోలవరం

రాష్ట్ర అభివృద్ధిని తాకట్టుపెట్టి దొంగ దీక్షలు
టీడీపీ డ్రామాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు
వైయస్‌ఆర్‌ జిల్లా: కమీషన్ల కోసమే ప్రతీ సోమవారం పోలవరంపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌బాషా విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కేంద్రానికి తాకట్టుపెట్టిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది రోజులుగా కపట దీక్షలు చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ జిల్లాకు ఏం సాధించారో చెప్పాలని అంజద్‌బాషా డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంలో టీడీపీకి భాగస్వామ్యం ఉందన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లి మోడీని కలిశానని చెప్పుకోవడం కాదు.. రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు దుష్టపరిపాలన సాగిస్తున్నారని, టీడీపీ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
పదిరోజులైనా సీఎం రమేష్‌ ఎలా చలాకీగా ఉన్నారు: సురేష్‌బాబు
ప్రత్యేక హోదా, విభజన అంశాలపై నాలుగేళ్లుగా పోరాటం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసిన ఏకైక నాయకుడు వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు సురేష్‌బాబు గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో విభజన హామీల కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు చేశామన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం ఏ రోజు పార్లమెంట్‌లో సీఎం రమేష్‌ మాట్లాడలేదన్నారు. పైగా ప్రజలను మభ్యపెట్టేందుకు పది రోజులుగా దీక్ష చేస్తున్నారన్నారు. పది రోజులుగా దీక్ష చేస్తున్నా సీఎం రమేష్‌ ఎలా చలాకీగా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం రమేష్‌ ఆరోగ్య రహస్యంపై బులిటెన్‌ విడుదల చేయాలన్నారు. అధికారుల మద్దతుతో ప్రభుత్వ దీక్షలా చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు చేసే దొంగ దీక్షలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 
Back to Top