దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

– తాంత్రిక పూజల వెనుక టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హస్తం
– దేవాదాయ శాఖ మంత్రి రోజుకో మాట చెబుతున్నారు.
– ఈ ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలి



విజయవాడ: తాంత్రిక పూజల వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. దుర్గమ్మ ఆగ్రహానికి తెలుగు దేశం ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని వారు హెచ్చరించారు. విజయవాడలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. గతేడాది డిసెంబర్‌  26వ తేదీ రాత్రి దుర్గమ్మ గుడిలో జరిగిన తాంత్రిక పూజలకు సంబంధించిన సీసీ ఫుటేజీలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇది పూర్తిగా సీఎంవో ఆఫీస్‌ నుంచి జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు.  దీని అంతటికి కారణం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న హస్తం ఉందన్నారు. వెంకన్న ఇంటి నుంచే ఇది జరుగుతున్నట్లు ఆరోపించారు. లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు అమ్మవారికి పూజలు చేయించారన్నారు. బుద్దా వెంకన్న అమ్మవారి పాదాల వద్ద ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఈ వ్యవహారం అంతా కూడా దేవాదాయ శాఖకు తెలియడం లేదని చెప్పారు. మొదటి నుంచి కూడా దేవాదాయ శాఖ మంత్రిని పక్కనపెట్టి తన శాఖ కార్యాకలాపాలను కొనసాగిస్తుందన్నారు. మాణిక్యలరావు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమ్మవారి ప్రతిష్టతను దిగజార్చే విధంగా, కనకదుర్గా ఆలయ ప్రతిష్టతకు మచ్చ తెచ్చారన్నారు. తప్పకుండా ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని కోరారు.  అర్చకులు ఈ అపచారాన్ని ఖండించాలని కోరారు. గతంలో కూడా టీడీపీ హయాంలోనే అమ్మవారి కిరీటం చోరీకి గురైందని గుర్తు చేశారు. అమ్మవారికి రక్షణ, భద్రత లేని పరిస్థితి నెలకొందన్నారు. అపచారాన్ని, అమ్మవారికి జరిగిన దోషానికి శాంతి పూజలు నిర్వహించాలన్నారు. జన్మభూమి కార్యక్రమం అందరిది అని చెప్పిన చంద్రబాబు నిన్న పులివెందులలో దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గమని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.  
  
 
Back to Top