రైతు దీక్ష లో ప్రముకుల ప్రసంగాలు

తణుకు: ‘మారిన మనిషినన్నావు.. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయనన్నావ్..  రుణమాఫీ చేస్తానన్నావ్..  రుణాలు కట్టవద్దని చెప్పి నేడు నయవంచన చేశావు. ఇంకెన్నాళ్లు  ఈ మోసాలు చేస్తావు చంద్రబాబూ’ అంటూ తణుకు రైతు దీక్షలో వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు, మహిళలు నిలదీశారు. రుణమాఫీకి డబ్బు లేదంటూనే కోట్లు ఖర్చు చేసి విదేశాలు తిరగడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు.

బాబు మెడలు వంచేందుకే దీక్ష: ఆళ్ల నాని, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు జిల్లాలోనే అధికంగా ఉన్నారు. బాబు మెడలు వంచేందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష  రైతులు, మహిళలకు ధైర్యాన్నిస్తోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన చంద్రబాబు రుణమాఫీని మరిచిపోండి, పిల్లల్ని కనండి అని చెప్పటం సిగ్గు చేటు. ఎన్టీఆర్ విగ్రహానికి మొక్కి బాబుకు మంచి బుద్ధి ఇమ్మని అడగాలి. రుణమాఫీ చేయమని కోరాలి. జిల్లా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని మా ముందుకు వచ్చిన వైఎస్ జగన్‌కు అభినందనలు తెలుపుతున్నాను.

నయవంచనకు బాబు మారుపేరు: కారుమూరి నాగేశ్వరరావు, తణుకు నియోజకవర్గ కన్వీనర్
చంద్రబాబు మాటలు నమ్మి రాష్ట్రంలోని రైతులు అన్యాయమైపోయారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. అదీ లేకుండా పోయింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానని, రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి వాటిని పక్కాగా అమలు చేశారు. చంద్రబాబు మాత్రం కోటయ్య కమిటీపై సంతకం చేసి రుణమాఫీని కృష్ణార్పణం చేశాడు. నయవంచనకు మారురూపంగా ప్రజలు బాబును భావిస్తున్నారు. 

ఆంక్షలతో రైతులకు కష్టాలు: వంగవీటి రాధా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు
రుణమాఫీకి రకరకాల ఆంక్షలు విధించటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి రాకముందు అసలు ఆధార్‌కార్డు ఎందుకన్నారు చంద్రబాబు. ఇప్పుడేమో ప్రతి పథకానికి ఆధార్‌లింక్ పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో 16 లక్షల మంది పింఛన్లు తొలగించి వారి పొట్టగొట్టావు. రాజధాని పేరుతో విజయవాడలో ల్యాండ్ ఫూలింగ్ చేస్తూ 30 వేల ఎకరాల్లో భూకబ్జాలు, భూదందాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు నీచమైన ఆలోచనలు చూసి జనం చీకొడుతున్నారు. జీతాలకు డబ్బులు లేవంటూనే విదేశాలు ఎలా పర్యటిస్తున్నావ్.


ఒక్క కార్యక్రమమైనా సజావుగా చేశావా: ముస్తఫా, గుంటూరు ఎమ్మెల్యే
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఎలాగుండేదో అందరికీ తెలుసు. ఆయన కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేశారు. అతిథి గృహానికి కోట్లు ప్రజాధనం కుమ్మరించారు. రూ.87 వేల కోట్లు రుణాల మాఫీకి రూ.5 వేల కోట్లు కేటాయించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఇస్తానన్న నిధులు సైతం విడుదల చేయకుండా నియోజకవర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. 8 నెలలు గడిచినా ఒక్క కార్యక్రమం అయినా చేయకుండా తాత్సారం చేస్తున్నారు. 

బాబుపై 420 కేసు పెట్టాలి: డి.ఈశ్వరి, ఎమ్మెల్యే
ఎన్నికల్లో ప్రజలు ఎంత మోసపోయారో ఇప్పుడే తెలుస్తుంది. రుణాలు మాఫీ చేయకుండా కప్పదాటు కుట్రలు చేస్తున్నారు. ఆఖరికి పింఛన్లు ఇవ్వటానికి కూడా షరతులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మోసాలకు పాల్పడుతున్న చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి. ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అమలు సాధ్యం కాని వాగ్ధానాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టడం దారుణం. చంద్రబాబూ ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతావు. రుణమాఫీకి నిధులు లేవంటూనే విదేశీ పర్యటనలు, ఆడంబరాలకు ఖర్చు చేయడం ఎంతవరకు సబబో నువ్వే చెప్పాలి.

అధికారమే పరమావధిగా: మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ

అధికారమే పరమావధిగా మోసపూరిత వాగ్ధానాలు చేశారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలో ఇప్పటికీ ఆలోచిస్తున్నారు. కుటిలనీతితో పాలిస్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడకపోవటం దారుణం. నగలపై తీసుకున్న రుణాలు చెల్లించకపోవటంతో వాటిని వేలం వేసేందుకు బ్యాంకులు సిద్ధపడుతున్నాయి. రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు చేతపట్టుకుని రైతులు రోడ్లుపై తిరుగుతున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను ఆకర్షించి గెలిచాడు. జిల్లాకు ఇన్నిసార్లు వచ్చినా ఒక్క అభివృద్ధి పథకాన్ని కూడా ప్రారంభించలేదు.

ఉండ్రాజవరం ఇండియన్ బ్యాంకులో లక్షాయాభై వేలు లోను తీసుకున్నాను. చంద్రబాబు రుణమాఫీ హామీతో ఆనందపడ్డాను. హామీ ఇచ్చి నట్టేట ముంచారు. ఇప్పుడు అప్పటి నుంచి వడ్డీ కట్టాల్సి వస్తోంది. రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్యే మాకు దిక్కు. కనీసం పింఛన్ కూడా రావడంలేదు.
-కంటూరి జానకిరావు, వేలివెన్ను

సరుదు లక్ష్మి, తాటిపర్రు, ఉండ్రాజవరం మండలం
నేను కూలీనాలీ చేసుకుని బతుకుతాను. డ్వాక్రా గ్రూపులో ఉన్నాను. మా గ్రూపులో 15 మంది సభ్యులు కలిపి 5 లక్షలు తీసుకున్నాం. రుణమాఫీని నమ్మి రుణం పెంచుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియడంలేదు. నాకు బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయి.

రుణమాఫీ చేస్తారని ఎదురు చూస్తూ ఇప్పటి వరకూ రెండు లక్షలు కట్టాం. ఇంకా లక్ష రూపాయలు కట్టాలి. ఇంకెప్పుడు చేస్తారు రుణమాఫీ అంటే అప్పు మొత్తం కట్టేశాక చేస్తారేమో. గ్రూపులోని అందరం కూలి పనులు చేసుకునే వారమే. హామీల మీద హామీలిచ్చి ఆడపడుచలందరి నోట్లో చంద్రబాబు మట్టికొట్టాడు.
 - నెల్లి చిట్టెమ్మ, వెంకట్రామన్నపాలెం, పెనుగొండ మండలం

ఇంత మోసమా: రాచపోలు ఫ్రాన్సీస్, కొత్తపల్లి, లింగపాలెం మండలం
నాకున్న 4 ఎకరాల్లో మొక్కజొన్న, వరిసాగు చేయడానికి మా ఊరి స్టేట్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ. 46 వేలు రుణం తీసుకున్నాం. టీడీపీ నాయకులు రుణమాఫీ చేసేస్తాం అని ఇచ్చిన హామీలన్నీ వట్టి మాటలే. చంద్రబాబు మాటలు నమ్మినందుకు అవ్వకు చెడ్డాం.. బువ్వకు చెడ్డాం. ఇంత మోసమా?

రైతుల కడుపుకొట్టాడు: కాపగ రామకృష్ణ, వల్లూరుపల్లి, పెంటపాడు మండలం 

చంద్రబాబు కట్టొద్దని చెబితే తీసుకున్న వ్యవసాయ రుణం కట్టడం మానేశా. ఇప్పుడు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి. చంద్రబాబు హామీలు నమ్మి మేము రోడ్డున పడ్డాం. మాకు ఆత్మహత్యలే శరణ్యం. రుణమాఫీ అంటూ రైతుంలందరి కడుపుకొట్టాడు. ఏ హామీని నెరవేర్చలేదు.

దొంగోడి చేతికి తాళాలిచ్చారు: బొమ్మిడి మాణిక్యమ్మ, దువ్వ, తణుకు మండలం 
జగనొస్తే నాకు న్యాయం జరుగుద్దనుకున్నా. జనాలు దొంగోడి చేతిలో తాళాలు పెట్టారు. మోసం చేసేవాడికే పదవి ఇచ్చారు. ఇప్పుడేడుత్తున్నారు. నా ఇన్ని సంవత్సరాల కాలంలో టీడీపీ మహిళలకు చేసిన న్యాయం ఒక్కటి కూడా లేదు. నాకు రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పింఛను వచ్చేది ఇప్పుడు తీసేశారు. 

రూ.2 వేలు మాఫీ: శకనాల రంగారావు, తణుకు మండలం, కోనాల గ్రామం

నాకున్న అరవై సెంట్ల వ్యవసాయ భూమితో పాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. నాకున్న బంగారంతో రూ.1.50 లక్షలు రుణం తీసుకున్నా. చంద్రబాబు రుణమాఫీ హామీతో సంబరపడ్డాను. రెండు వేలు మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు.

మహిళల్ని వంచించాడు: పువ్వుల రతీదేవి, డ్వాక్రా మహిళ

మహిళలంటే ఎంతో గౌరవమని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళలను వంచించాడు. మాఫీ హామీతో నమ్మి ఓట్లేశాం. ఇప్పుడు గ్రూపు అంతటికీ కలిపి రూ.10 వేలు మాఫీ చేస్తామంటూ చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రుణాలు కట్టవద్దంటే కట్టలేదు. ఇప్పుడు వడ్డీలకే వేలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Back to Top