బండారం బయట పడుతుందనే

టీడీపీ నీచంగా నేరాలకు పాల్పడుతోంది
చర్చిస్తే దొరికిపోతామని ప్రతిపక్షాన్ని అడ్డుకుంటోంది
చంద్రబాబు రైతుల కడుపు కొడుతున్నారు
కేంద్ర నిధులను వాడుకుంటున్నారుః విశ్వేశ్వర్ రెడ్డి

అసెంబ్లీః రాష్ట్ర ప్రభుత్వానికి ప్రారంభం నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచనే లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మొక్కుబడిగా ఐదు రోజులు సమావేశాలు అని చెప్పి .. ఆ ఐదు రోజులు కూడా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో ....అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో తల్లి బిడ్డల్ని కూడా బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం అత్యంత నీచమన నేరమని విశ్వేశ్వర్ రెడ్డి  ఆక్రోషించారు. దీనిపై చర్చ చేస్తే  తెలుగుదేశం నాయకుల బండారం బయటపడుతుందని సమావేశాలు సజావుగా సాగకుండా కుట్ర చేసిందని, దానిలో భాగంగానే అంబేద్కర్ గారి ఇష్యూను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మాట్లాడకుండా  అడ్డుపడ్డారని నిప్పులు చెరిగారు. 

మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు  ముఖ్యమంత్రి కక్షగట్టి మహిళా శానససభ్యురాలు రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం దారుణమన్నారు. మొండిగా వ్యవహరిస్తున్న  ప్రభుత్వం  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది.  కనివినీ ఎరుగని రీతిలో తుఫాన్ లతో రాష్ట్రం నష్టపోయింది. కరవు మండలాలను గుర్తించడంలో కూడా ప్రభుత్వం శాస్త్రబద్దంగా వ్యవహరించలేదని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రెండు విడతలుగా కరవు మండలాలను గుర్తించడం ప్రభుత్వ వైఫల్యానికి, రైతాంగం పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. 

2014లో పంటనష్టానికి సంబంధించి ఇన్ పుట్ సబ్సిడీ రూ. 1100 కోట్లు ఇస్తామని కేబినెట్ లో చెప్పి దాన్ని కుదించారని ... అదీ కూడా ఇంతవరకు సరిగా అందివ్వలేదని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి వస్తున్న డబ్బును కూడా చంద్రబాబు వాడుకొని రైతుల కడుపు కొడుతున్నారన్నారు. రాష్ట్రంలో దారుణమైన కరువు వచ్చింది.  ఎన్యూమరేషన్ చేయడం లేదు. రైతులను ఏవిధంగా ఆదుకోవాలన్న ఆలోచనే టీడీపీ ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు.  ప్రభుత్వమే స్వయంగా ఎన్యూమరేషన్ ఆపివేయమందని అధికారులు చెబుతున్నారంటే  దారుణమన్నారు. 

గోదావరి పుష్కరాలు, రాజధాని పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు...రైతులకు అందించాల్సిన పరిహారం విషయంలో మాత్రం మొండిచేయి చూపుతున్నారన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ , ఇన్సూరెన్స్ సహా రైతులకు రుణాలు ఇచ్చిన పాపాన పోవడం లేదన్నారు. రైతాంగం అప్పుల పాలు కావడానికి ప్రభుత్వమే కారణమన్నారు. సగం రుణాలు కూడా ఇవ్వని సర్కార్..వీటిపై చర్చ జరగకుండా రెచ్చగొట్టే పద్ధతిలో పోతుందని దుయ్యబట్టారు.  రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని ఆయన పైరయ్యారు. కూలీలు వలసలు పోతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరణించిన రైతుకుటుంబాలకు పరిహారం అందించే విషయంలో కూడా ప్రభుత్వం నీచరాజకీయాలు చేస్తోందని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను అధ్యక్షులు వైఎస్ జగన్ పరామర్శించడం వల్ల, రైతులు పోరాటం చేయడం వల్ల కొంతమందికే పరిహారం చెల్లించారన్నారు.  రైతుల దుస్థితి పట్ల ప్రభుత్వం పరిహాసం ఆడుతోందన్నారు. వీటిపై సభలో నిలదీస్తామనే ప్రతిపక్షాన్ని అడ్డుకుంటోందన్నారు. లెవీ రద్దు కావడం వల్ల వ్యవసాయమే కుప్పకూలే పరిస్థితి వచ్చిందని,  రైతుల నుంచి  ధాన్యం కొనేందుకు ప్రభుత్వానికి చేతగావడం లేదని ఎద్దేవా చేశారు. రూ. 5 వేల కోట్లతో  ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు ఆఊసేలేదు. కేంద్రం లెవీ రద్దుచేయడం కోట్లాదిమంది రైతాంగానికి శరాగాతంగా మారింది. ప్రారంభంలోనే  వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి ఇది సరైందికాదని మోడీ ప్రభుత్వానికి  విన్నవించాం. సెంట్రల్ ను నేనే నడుపుతానని చెప్పుకునే  చంద్రబాబు ఒక్కసారి కూడా దీనిపై కేంద్రంతో చర్చించిన పాపాన పోలేదని విశ్వేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

కాల్ మనీ సెక్స్ రాకెట్ తెలుగుదేశం కనుసన్నల్లో సాగుతుందని ఎమ్మెల్యే చాంద్ బాషా అన్నారు. దీనిపై చర్చ జరగాలని  పట్టుబడితే   అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. ప్రతిపక్షానికి సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితిలో సభను నడుపుతున్నారని మండిపడ్డారు. మహిళలపై జరిగిన అన్యాయంపై చర్చ జరపాలని నిరసన తెలియజేస్తే ...ఎలాంటి అసభ్యకర మాటలు లేనప్పటికీ రోజాను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు.  
Back to Top