రాజధాని పేరుతో ప్రజాధనం దుర్వినియోగం...!

విజయవాడః ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధన కోసం  వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారని ఆ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈనెల 7 నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష చేస్తారని వారు వెల్లడించారు. వైఎస్ జగన్ ఏకార్యక్రమం చేపట్టినా పట్టుదలతో చేసే వ్యక్తని ఈసందర్భంగా తెలిపారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే మూలకారకుడని విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో నేతలు  విమర్శించారు. 

చంద్రబాబు, వెంకయ్యనాయుడులు  ప్రత్యేకహోదాను అడ్డుకుంటున్నారన్న భావన ప్రజల్లో ఉందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రం గురించి గానీ, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ల గురించి గానీ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో విదేశాల చుట్టూ తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 
Back to Top