<br/>విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల తీరని కల అయిన రైల్వే జోన్ మీద పోరు ఉధృతం అవుతోంది. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తోంది. రైల్వే ప్రత్యేక జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా నిర్వహించింది. ధర్నానుద్దేశించి పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలేవీ నెరవేరలేదన్నారు. విశాఖకు రైల్వే జోన్‌పై విశాఖ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయిస్తే పూర్తవడానికి 300 ఏళ్లు పడుతుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి సాయం చేయకపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. తనతో పాటు కొడుకు స్వలాభం కోసం రూ.2200 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారన్నారు. రాష్ట్రానికి నిధులిస్తే పట్టిసీమలా దోచుకుంటారని కేంద్రానికి తెలిసిపోయినందునే నిధులివ్వడం లేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాకే పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తుందన్న ఆలోచనలో కేంద్రం ఉందన్నారు.ఈ ధర్నాలో జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.