నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్‌

లక్షన్నర ఉద్యోగాలు మూడు నెలల్లో భర్తీ చేయాలి
వైయస్‌ఆర్‌ సీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైయస్‌ఆర్‌ సీపీ ధర్నాలు
హైదరాబాద్‌: కేసీఆర్‌ సర్కార్‌ నిరుద్యోగులను మోసం చేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న లక్షన్నర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు వైయస్‌ఆర్‌ సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి రెహ్మాన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యమం అన్న కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేశాడని, ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు లభించాయన్నారు. మూడు నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని, రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపొందాలంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కేసీఆర్‌ది ఎలక్షన్, కలెక్షన్, కన్‌స్ట్రక్షన్‌ సిద్ధాంతాలని, ప్రజలను గాలికి వదిలేశాడన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నీరు, నిధులు, నియామకాలపై ఏర్పడిందని, రాష్ట్రంలో 30 లక్షల నిరుద్యోగులు ఉన్నారన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వం లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయాలని, లేదంటే నిరుద్యోగుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. 
Back to Top