వైయస్‌ఆర్‌సీపీ నేతలతో ముద్రగడ భేటీ

పాలకొండ: కాపు ఉద్యమానికి మద్దతివ్వాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను కోరారు. గురువారం ముద్రగడ వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు, రెడ్డిశాంతి,పాలవలస రాజశేఖరం, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. పాలకొండలోని రాజశేఖరం గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ గతంలో కాపు కులాలు కలిసి ఉండేవని, రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను విడగొట్టి కాపు జాతికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం అనగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేర్చుతామని హామీఇచ్చి వారి ఓట్లును దండుకున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు కాపులను అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులతో పాలన సాగిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. బ్రిటీష్‌కాలం నుంచి వెనుకబడిన కులాలైన కాపు, తెలగ, బలిజి, ఒంటరి కులాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కాపుజాతి కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో తుదిశ్వాస విడిచేవరకు పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఈ ఉద్యమానికి అన్ని కులాల నాయకులు సంఘీభావం కోరుతూ ఈ పర్యటన చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ముద్రగడ చేస్తున్న కాపు ఉద్యమానికి మద్దతు తెలిపారు.  

Back to Top