హస్తినలో రగిలిన హోదా నినాదం


ఢిల్లీ: తెలుగువారి ఆత్మగౌరవాన్ని హక్కుల సాధనను లక్ష్యంగా చేసుకుని ఎపి నుండి బయలు దేరిన హోదా రైలు ఢిల్లీ చేరుకుంది. వేలాదిగా తరలి వచ్చిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు ఢిల్లీ నడిబొడ్డున తమ నినాదాన్ని వినిపించాయి. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో దేశ రాజధాని నగరంలో 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష కేంద్రానికి తాఖీదులిచ్చింది. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, అది భిక్ష కాదని గర్జించింది. 

తరలి వచ్చిన నేతలు, ప్రజలు
ఛలో ఢిల్లీ అంటూ ప్రతిపక్షనేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు స్పందించి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ అన్ని జిల్లాల నుంచీ ప్రజలు ఢిల్లీకి తరలి వెళ్లారు. శాంతి యుతంగా, ప్రజాస్వామ్య బంధంగా నిరసన వ్యక్తం చేశారు. సంసద్ మార్గ్ లో జరిగిన మహా ధర్నాలో పలువురు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ గళాన్ని వినిపించారు. 

ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే అవిశ్వాసం, రాజీనామాలు తప్పవని ప్రకటించారు. ఎపి అసెంబ్లీలో గవర్నర్ తన ప్రసంగంలో ప్రత్యేకహోదా గురించి మాట్లాడటం పై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో హోదా కావాలని ఓ మాట చెప్పినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. కేంద్రం పై ఒత్తిడి తేవాలని, కేంద్రంలో ఉన్న టిడిపి మంత్రులు రాజీనామాలు చేయాలని సవాల్ చేశారు. 

10 సంవత్సరాలు హోదా అని వెంకయ్యనాయుడుగారు, 15 ఏళ్లు అని చంద్రబాబు గారు మాటిచ్చారు. కనుక ఆ మాటను నిలబెట్టుకోవాలనీ, ప్రత్యేక హోదా సాధించేదాకా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పోరాటం ఆగదని అన్నారు ఎమ్.పి. వరప్రసాద్.
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు రెండు సార్లు హోదా తీర్మానం ప్రవేశ పెట్టారని, అవి ఎక్కడకి కొట్టుకుపోయాయని ప్రశ్నించారు. తెలుగువారి హోదా ఆకాంక్షను దేశానికి తెలియజేసేందుకే ఢిల్లీలో ధర్నా చేపట్టామని ఆయన తెలియజేశారు.

మోడీ ప్రధానిగా ఉండగా 2015లో 13వ ఆర్థిక సంఘం ఉందని, ఆ తర్వాత ప్రవేశపెట్టిన 14వ ఆర్థిక సంఘంలో హోదాపై మార్పులు జరిగితే ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు హోదాపై మోడీని ఎందుకు అడగలేదని నిలదీశారు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అప్పట్లో మంత్రి పదవుల కోసం బేరసారాల్లో పడి హోదాని తాకట్టు పెట్టేశారని టిడిపిపై విరుచుకుపడ్డారు. అయినా 14వ ఫైనాన్స్ కమీషన్ ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. 

అక్ర‌మ అరెస్టులు
ప్రత్యేక హోదాపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిసారీ ఏదో విధంగా అడ్డుకునేవారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు. అదే తరహాలో ఇప్పుడు దేశ రాజధానిలోనూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ నేతలను అడ్డుకుని, హోదా పోరాటాన్ని ఆపే ప్రయత్నం జరుగుతోంది. కుట్ర పూరితంగా, పోలీసులను పురకొల్పి మరీ వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ నేతలను అరెస్టులు చేయించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. హోదా ఇస్తామని మోడీ, తెస్తానని చంద్రబాబు, నేను హామీ అంటూ పవన్ కళ్యాణ్ ఆనాడు రాష్ట్ర ప్రజలను నమ్మించారు. నాలుగేళ్లు గడిచిపోయినా కేంద్రం హోదా గురించి మాట్లాడలేదు. హోదా కంటే ప్యాకేజీ బెస్టు అంటూ చంద్రబాబు ప్లేటు తిప్పేసాడు. అసలు హోదా రాకపోవడానికి కారణం ఏమిటో వెతుకుతా అంటూ పవన్ కళ్యాణ్ కాలయాపన చేస్తున్నాడు. చివర్లో హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ చేసిన ధర్నాలనీ తేల్చేందుకు మేధావులో కలిసి స్కెచ్ వేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ప్రజల తరఫున, కోట్లాదిమంది ఆంధ్రుల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షనేత వైయ‌స్ జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీ గద్దెమీద ఉన్న పెద్దలకు వినిపించేలా హోదాపై నినదిస్తోంది. శాంతియుతంగా జరుగుతున్న ఈ ధర్నాను అరెస్టులతో నిర్వీర్యం చేయాలని, దౌర్జన్యపూరితంగా అణిచివేయాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఎలాగూ మిత్రపక్షమే కనుక, హోదాపై పైపై మాటలే తప్ప కార్యాచరణకు పూనుకోదని తెలుసు కనుక ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ హోదా పోరాటంపై ఉక్కు పాదం మోపుతోంది. కానీ ప్రభుత్వాలకు, పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం సాగుతున్న ఈ పోరు ఇంతటితో ఆగదని, అరెస్టులతో హోదా ఉద్యమాన్ని ఆపలేరని అంటున్నాయి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పోలీసుల లాఠీల మధ్య, బలవంతపు అరెస్టుల మధ్య, పోలీస్ స్టేషన్ నిర్బంధాల మధ్య కూడా హోదా మా హక్కు, ప్యాకేజీతో మోసం చేయద్దు అంటూ నినదిస్తున్న ఆ గళాలే అందుకు సాక్ష్యం. 


 
Back to Top