ఉక్కు పోరాటంపై సర్కార్‌ ఉక్కుపాదం

– కడప ఉక్కు పరిశ్రమ కోసం  రహదారుల దిగ్బంధం
– వైయస్‌ఆర్‌సీపీ నేతలను బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు
– ప్రభుత్వ తీరుపై వైయస్‌ఆర్‌ జిల్లా వాసుల ఆగ్రహం
వైయస్‌ఆర్‌ జిల్లా: కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరుబాటు పట్టింది. ఉక్కు పోరాటంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఉక్కు పరిశ్రమ కోసం దొంగ దీక్షలు చేపట్టిన అధికార తెలుగు దేశం పార్టీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఉక్కు పోరాటం కోసం ఉద్యమిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ, అఖిలపక్ష నాయకులను బలవంతంగా అరెస్టు చేసి ఉక్కుపాదం మోపింది. బుధవారం జిల్లాలోని రహదారులను వైయస్‌ఆర్‌సీపీ నాయకులు దిగ్బంధించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కడప–తిరుపతి రహదారిపై భారీగా  వాహనాలు నిలిచిపోయాయి.  బద్వేలు, రాజంపేటలో రహదారులను వైయస్‌ఆర్‌సీపీ నాయకులు దిగ్బంధించారు. రాజంపేటలో వైయస్‌ఆర్‌సీపీ నేతల ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తోరోకోలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజాద్‌బాషా, సురేష్‌బాబు, అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం కొనసాగుతోంది. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఇన్నాళ్లు కడపలో ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుకున్న చంద్రబాబు ఇవాళ ఉద్యమాన్ని కూడా అడ్డుకుని మోసం చేశారని జిల్లావాసులు మండిపడుతున్నారు.
 
Back to Top