ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరాటం ఆగదు

వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు పరిశ్రమ సాధించే వరకు పోరాటం ఆగదని రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. కడప ఎంపీగా పార్లమెంట్‌లో అనేక సందర్భాల్లో ఉక్కు పరిశ్రమ అంశాన్ని ప్రస్తావించానని గుర్తుచేశారు. కడప ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కడప అంబేద్కర్‌ సర్కిల్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వైయస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో పెట్టిన అంశాలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రిని కలిసి పరిశ్రమపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని కోరామని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశాం.. ఆమరణ నిరాహార దీక్షలు చేశామని, ఒకపై ప్రజల్లో ఉంటూ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రత్యేక హోదా, ఉక్కు పరిశ్రమ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాడుతామన్నారు. 

ఏనాడైనా పార్లమెంట్‌లో పోరాడారా: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏనాడైనా పార్లమెంట్‌లో పోరాడారా అని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, మేయర్‌ సురేష్‌బాబు ప్రశ్నించారు. సీఎం రమేష్‌ ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తానని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా, జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇస్తానని అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. నాలుగేళ్లుగా కేంద్రంతో కలిసి ఉన్న చంద్రబాబు ఒక్కరోజైనా కడప ఉక్కు పరిశ్రమ ఇవ్వాలని డిమాండ్‌ చేశారా అని నిలదీశారు. పరిశ్రమ సాధించే వరకు  పోరాటం ఆగదని, ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.  
Back to Top