వేమిరెడ్డి ఏక‌గ్రీవ ఎన్నిక‌పై సంబ‌రాలు


నెల్లూరు: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అమరావతిలో ఆయన రిటర్నింగ్‌ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మూడు స్థానాలకు గాను పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ప్రధాన ప్రతిపక్షమైన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఒక స్థానం ద‌క్కింది. ఈ క్రమంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఈ నెల7న రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అధికార పార్టీ వారి బలానికి అనుగుణంగా ఇద్దరు అభ్యర్థుల్నే బరిలో దింపటంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. నామినేషన్‌ స్వీకరణ, స్క్రూట్ని ప్రక్రియ ముగింపు అనంతరం ఉపసంహరణకు గురువారం వరకు గడువు ఉంది. ఈ క్రమంలో ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక గురువారం అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.సత్యనారాయణ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేశారు. వేమిరెడ్డి ఎన్నికతో జిల్లాలో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. వేమిరెడ్డి అనుచరుడు, పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సాయంత్రం వేమిరెడ్డి నివాసం వద్ద బాణసంచా కాల్చి సందడి చేశారు. 

బయోడేటా
పేరు: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
పుట్టిన తేదీ : 19–4–1956
తల్లిదండ్రులు :శివకోటారెడ్డి, శ్యామలమ్మ
భార్య : వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
విద్యాభాస్యం : ప్రాథమిక విద్య– మదనపల్లిలోని రిషీవ్యాలీ స్కూల్‌
గ్రాడ్యుయేషన్‌ :1973–1976 చెన్నైలోని లయోలా కళాశాల
వ్యాపారం :    గ్లోబల్‌ కాంట్రాక్టర్‌ 1979లో తండ్రి నిర్వహిస్తున్న మైకా వ్యాపారం నిర్వహణ, 1981లో లక్ష్మికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నిర్వహణ 1989లో వీపీఆర్‌ మైనింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రారంభం

 

Back to Top