పంటలకు మద్దతు ధర ఆత్మవంచన

హేతుబద్ధత లేకుండా ఎంఎస్‌పీ
స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు కాలేదు

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించామని చెప్పడం నామమాత్రపు చర్య అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దేశంలో సుమారు 70 రకాల పంటలు పండిస్తుంటే.. 14 పంటలకు మాత్రమే ఎంఎస్‌పీ పెంచడం ఆత్మవంచన అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటలకు మద్దతు ధర కల్పించామని ప్రకటించడం వంచిండమేనన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధర పెంచాల్సిన మేరకు పెంచలేదని అభిప్రాయపడ్డారు. 2005లో నియమించబడిన స్వామినాథన్‌ కమిషన్‌ రైతు సంక్షేమంపై సూచనలు ఇవ్వండి అని కోరితే.. రైతులు పండిన పంటల ధరలు గిట్టుబాటుగా ఉండాలని తేల్చిందని, పెట్టిన ఖర్చుపై 50 శాతం పెంచి కనీస మద్దతు ధర ఇవ్వాలని కమిటీ నివేదిక అందజేసిందన్నారు. 

14 సంవత్సరాలైనా గత ప్రభుత్వాలు, ఇవాళ పరిపాలన చేస్తున్న ప్రభుత్వం స్వామినాథన్‌ కమిషన్‌ ఆధారంగా కనీస మద్దతు ధర పెంచిన పాపాన పోలేదన్నారు. హేతుబద్ధత లేకుండా చేశారన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రధానమైన పంట వరి అని దానికి క్వింటాల్‌కు రూ. 200లు పెంచామని బీజేపీ గొప్పుగా చెబుతుందన్నారు. కానీ ఇటీవల డీఏపీపై రూ. 200లు ధర పెంచారన్నారు. పంట పెట్టుబడులు పెంచుతూ.. రైతులను ఆదుకుంటామని చెప్పడం సమంజసం కాదన్నారు. 
 
Back to Top