గుంటూరు: చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముస్లిం యువకులపై గుంటూరు సభ సందర్భంగా పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని వైయస్ఆర్‌సీపీ నేత శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి డిమాండు చేశారు. గుంటూరులో అరెస్టు అయి బెయిల్‌పై విడుదలైన ముస్లిం యువకులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్కరికి భావ వ్యక్తికరణ స్వేచ్ఛ ఉందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలలో కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తుంటారని, అలాంటప్పుడు వారిని కూడా దేశ ద్రోహులు అంటారా అని నిలదీశారు. చంద్రబాబు తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధించడం సరికాదన్నారు.
నాలుగేళ్లుగా ముస్లింలకు చంద్రబాబు చేసిందేమీ లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హబీబుల్లా విమర్శించారు. ముస్లింలను టీడీపీ ప్రభుత్వం అన్నివిధాలుగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిలో ముస్లింలు పాలుపంచుకుంటారన్నారు. కచ్చితంగా ముస్లింలు వారి రుణాన్ని తీర్చుకుంటారని వివరించారు.