బాబుది క‌ప‌ట ప్రేమ‌


- టీడీపీ నాయకులు దీక్షల పేరుతో డ్రామాలు
– నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు నాటకాలెందుకు
– ఎన్నికలు వస్తున్నాయని అంగన్‌వాడీలు, వీఆర్‌ఏల జీతాల పెంపు
 విజయవాడ: ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని వేత‌నాలు పెంచి చంద్ర‌బాబు క‌ప‌ట ప్రేమ చూపుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు సామినేని ఉద‌య‌భాను విమ‌ర్శించారు. టీడీపీ నాయకులు దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నారని అన్నారు .  విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, తదితరులతో కలిసి ఉదయభాను విలేకరులతో మాట్లాడారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నాయకులు చేసింది దొంగ దీక్ష అని తేలిపోయిందన్నారు. ఉక్కురాదు, తుక్కు రాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారని గుర్తు చేశారు. జోన్‌రాదు, గీన్‌ రాదని ఆవంతి శ్రీనివాస్‌ అన్నారన్నారు. ఐదు కేజీల బరువు తగ్గడానికి దీక్ష చేస్తానని ఎంపీ మురళీమోహన్‌ పేర్కొన్నారని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా చంద్రబాబు ఏమీ సాధించలేకపోయారని మండిపడ్డారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తరువాత మీరు సాధిస్తారన్న నమ్మకం ప్రజల్లో లేదన్నారు.  కలిసి ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు తీసుకురావడంలో వైఫల్యం చెందారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలను కూడా నెరవేర్చేందుకు కేంద్రం మెడలు వచ్చి సాధిస్తామన్నారు. 

– చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారన్నారు. దళితులకు రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారిపై అరాచకాలు, దాడులు పెరిగిపోయాయని సామినేని ఉదయభాను ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలు జరిగితే భవిష్యత్తు ఏంటనే డైలామాలో పడ్డ చంద్రబాబుకు ఇవాళ తాను ఇచ్చిన హామీలు గుర్తుకు వస్తున్నాయన్నారు. గ్రామ సేవకులుగా ఉన్న వారిని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి వీఆర్‌ఏలుగా గుర్తించారన్నారు. పదో తరగతి పాస్‌ అయిన వీఆర్‌ఏలను వీఆర్‌వోలుగా పదోన్నతి కల్పించి అండగా ఉన్నారన్నారు. నాలుగేళ్లు పట్టించుకోని చంద్రబాబుకు మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని వీఆర్‌ఏల వేతనాలు పెంచారన్నారు. 

– అంగన్‌వాడీ వర్కర్స్‌ను చంద్రబాబు అనేక విధాలుగా వేధించారని ఉదయభాను పేర్కొన్నారు. గతంలో వారిని గు్రరాలతో తొక్కించారని గుర్తు చేశారు. ఏడాది క్రితం హక్కుల సాధనకు కలెక్టరేట్ల వద్ద దీక్షలు చేస్తే అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఆడవాళ్లు అని చూడకుండా రాత్రంతా పోలీసుస్టేషన్‌లో నిర్భందించిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. మూడు నెలల క్రితం వెలగపూడి సచివాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన  అంగన్‌వాడీలను ముందస్తుగా  అరెస్టు చేశారన్నారు. ఇదేనా మహిళలపై మీకున్న ప్రేమ అని చంద్రబాబును నిలదీశారు. ఎన్నికలు వస్తున్నాయని ఇవాళ వారిపై చంద్రబాబు కపట ప్రేమ చూపుతున్నారన్నారు. 
 
Back to Top