ప్రచార ఆర్భాటానికే ‘జన్మభూమి’

– ప్రజలకు ఎలాంటి మేలు జరుగలేదు
– వివక్షపూరితంగా పింఛన్లు, ట్రాక్టర్ల పంపిణీ
– జన్మభూమిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
విజయవాడ:  ప్రచార ఆర్భాటం కోసమే జన్మభూమి– మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, వివక్ష పూరితంగా పింఛన్లు, ట్రాక్టర్లు పంపిణీ చేసి టీడీపీ నేతల జేబులు నింపారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి కోసం చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసపూరిత హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. పొదుపు రుణాలు మాఫీ చేశామని ఇప్పుడు జన్మభూమి కార్యక్రమంలో గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రుణమాఫీ ద్వారా మహిళలకు లబ్ధి చేకూరిందో లేదో ఒక్కసారైనా సమీక్ష చేశారా అని నిలదీశారు. మీ మాటలు నమ్మి మహిళలు బ్యాంకులకు అప్పుకట్టకపోవడంతో వారు వడ్డీల మీద వడ్డీలు చెల్లించాల్సి వస్తుందన్నారు. డ్వాక్రా రుణాల మాఫీపై మీరు సమీక్ష చేసి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వం రాకముందు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందేవన్నారు. మీరు వచ్చాక ఎటు రుణాలు మాఫీ కాలేదని, కనీసం వడ్డీలైనా మాఫీ చేస్తారా అని ప్రశ్నించారు. 

19 లక్షల ఇల్లు కట్టిస్తారా?
చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి అవుతుందని, ఇంతవరకు లక్ష ఇల్లు కూడా కట్టించలేకపోయారని, జన్మభూమి సభల్లో మాత్రం ఏడాదిలో 19 లక్షల ఇల్లు కట్టిస్తామని మభ్యపెడుతున్నట్లు పార్థసారధి మండిపడ్డారు.  ఒక్క ఏడాదే 19 లక్షల ఇల్లు కట్టిస్తామని  జన్మభూమిలో చెప్పుకోవడం మోసపూరితమన్నారు.  మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..వెంటనే ఇల్లు పూర్తి చేసుకున్న వారికి పూర్తిగా బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

‘ఉపాధి’ డబ్బులు చెల్లించండి
ఐదు నెలలుగా ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించలేని చంద్రబాబు ప్రభుత్వం  అర్భాటాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని పార్థసారధి విమర్శించారు.  పుష్కరాల పేరుతో వేల కోట్లు దోపిడీ చేశారని, కూలీలకు మాత్రం డబ్బులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ నేతలు సిగ్గు, లజ్జ, బిడియం అన్ని విడిచి పెట్టి పోలీసుల సహకారంతో మరోసారి ప్రజల మధ్యకు వెళ్లారని ఎద్దేవా చేశారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరుగలేదని విమర్శించారు. మీ మాటలపై నమ్మకముంటే జన్మభూమిలో ఎన్ని అర్జీలు వచ్చాయి. ఎంతమంది ప్రతిపక్ష నాయకులను నిర్భందించారు. ఎంత మందిపై దాడులు చేయించారో వాటన్నింటì పై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. రైతులకు ట్రాక్టర్లు పంపిణీ వివక్ష పూరితంగా చేశారన్నారు. మీరిచ్చిన పింఛన్లలో వివక్ష లేదని భావిస్తే వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వితంతు, వృద్ధాప్య పింఛన్ల పంపిణీపై శ్వేత పత్రం విడుదల చేయాలని పార్థసారధి డిమాండ్‌ చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top