చంద్రబాబు వ్యవసాయాన్ని అణగదొక్కుతున్నారు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయ్‌
వైయస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాదరెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంగుటూరు ప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ అందించకుండా చంద్రబాబు రైతులను ఆర్థికంగా అణగదొక్కుతున్నాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ కరువుపోరు మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 2012–13కు సంబంధించి జిల్లాలోని 20163 మంది రైతులకు రూ. 156 కోట్లు రావాల్సి ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఇన్సూరెన్స్‌ విషయంపై కడప జిల్లా కలెక్టరేట్‌ మొదలుకొని చివరకు హైదరాబాద్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఎదుట కూడా ధర్నా చేశామన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి 2016 ఆగస్టు 27వ తేదీన ఢిల్లీలోని కేంద్ర వ్యవసాయ శాఖ కమిషనర్, సంబంధిత మంత్రికి లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తే మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సమాధానం చెప్పారన్నారు. 2016–17కు సంబంధించి 52 వేల మందికి వంద కోట్లకు పైగా రావాల్సి ఉందన్నారు. 2013 నుంచి పెట్టుబడి రాయితీ రాలేదన్నారు. ఇంత వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గత నెలలోనే జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లాలో 1.34 లక్షల హెక్టార్లలో పంట సాగు చేయాల్సి ఉంటే కేవలం 8500 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారన్నారు. అవి కూడా వర్షాలు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి రైతులే సరైన గుణపాఠం చెబుతారన్నారు. 
Back to Top