అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. రాప్తాడు తహసీల్దార్ కార్యాయంలో వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్రెడ్డి (50)ని ఈ రోజు మధ్యాహ్నం దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఓ పని నిమిత్తం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన అతడిని పథకం ప్రకారమే హతమార్చారు. ఈ దాడిలో సుమారు ఆరుగురు పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా టీడీపీ వర్గీయులే ప్రసాద్ రెడ్డి హతమార్చారని బంధువులు ఆరోపిస్తున్నారు.<br/>ప్రసాద్ రెడ్డి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌గా కూడా పనిచేశారు. అలాగే మాజీ ఎమ్మల్యే గుర్నాథరెడ్డికి ఆయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించేవాడు. ప్రసాద్ రెడ్డి ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.